సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : ఇళ్లలో జరిగే దొంగతనాలను అరికడుతూ ప్రజలు ధైర్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఆదేశించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్ పోలీసు అధికారులతో నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీ క్రైమ్ సిబ్బందితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ, దొంగతనాలు చేసే అంతర్రాష్ట్ర ముఠాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. నేరస్తులను పట్టుకోవడంలో సీసీటీవీ పుటేజీలను ఉపయోగించుకోవాలని, పాత నేరస్తులపై నిరంతరం నిఘా పెట్టి, వాళ్లు తిరిగి నేరాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వరుస దొంగతనాలు చేసే వారిపై పీడీ యాక్టులు పెట్టాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో తీసుకుంటున్న చర్యలతో దొంగతనాలు తగ్గుముఖం పట్టాయన్నారు.
నేర దర్యాప్తులో సివిల్, ట్రాఫిక్, సాంకేతిక విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. రాత్రి పూట దొంగతనాలు జరిగే అవకాశాలుండటంతో బంగారం, డబ్బు లాకర్లలో దాచుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రజలు వీలైనంత వరకు నేను సైతం, కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు సీపీ అభినందనలు తెలిపారు. క్రైమ్స్ డీసీపీ మధుకర్స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సీసీఎస్ అదనపు డీసీపీ లక్ష్మి, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.