సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): డిపార్ట్మెంట్ ఆఫ్ గూగుల్ పార్ట్‌టైమ్ జాబ్స్ అఫర్ చేస్తుందంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. ఓ ప్రైవేట్ ఉద్యోగినికి రూ.8 లక్షలు టోకరా వేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన ప్రైవేటు ఉద్యోగిని టెలిగ్రామ్ ఐడీకి గ్లోబల్ ఆన్లైన్ మీడియా పార్ట్‌టైమ్ జాబ్స్ ఆఫర్ చేస్తోందని, తాను గూగుల్ ప్రమోషన్ డిపార్టుమెంట్‌కు చెందిన ప్రతినిధినంటూ సరిత పేరుతో ఒక మెసేజ్ వచ్చింది.
గూగుల్ మ్యాప్స్‌లో హోటల్ రెస్టారెంట్స్‌కు సంబంధించిన రివ్యూలు రాయాల్సి ఉంటుందని, మొదట రూ. 1040 చెల్లించాలంటూ సూచించారు. టాస్క్లుంటాయని, ఒక్కోటాస్క్కు రూ.50లు మీ ఖాతాలో డిపాజిట్ అవుతుందని, 20 టాస్క్లిస్తారని, అదనంగా కావాలంటే ఇంకా ఎక్కువగా కూడా ఇస్తారంటూ సూచించారు.
దీంతో బాధితురాలు అది నిజమని నమ్మి డబ్బు కడుతూ వెళ్లింది. అయితే మొదట కొంత లాభమంటూ స్క్రీన్‌పై చూపించిన నేరగాళ్లు.. మీరు సరిగ్గా టాస్క్‌లు పూర్తి చేయలేదని, మీ డబ్బు ఇప్పుడు డ్రా చేయలేరని, మరో టాస్క్ చేసి అందులో గతంలో పెండింగ్‌లో ఉన్న డబ్బును కలుపుకొని తీసుకోవాలంటూ నమ్మిస్తూ దఫ దఫాలుగా రూ. 8 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బులు చెల్లించాలంటూ సైబర్‌నేరగాళ్లు సూచిస్తుండడంతో ఇదంతా మోసమని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.