Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం వెలుగు చూసింది. వనస్థలిపురం పరిధిలోని ఓ ప్రయివేటు స్కూల్లో ఓ విద్యార్థి నోటికి టేపు వేసి హింసించింది టీచర్. సదరు టీచర్ వేధింపులకు భయపడ్డ ఆ పిల్లాడు స్కూల్‌కు వెళ్లకపోవడంతో ఈ ఘటన వెలుగు చూసింది.
వనస్థలిపురానికి చెందిన ఓ విద్యార్థి.. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. అయితే ఆ విద్యార్థిని టార్గెట్ చేసిన టీచర్.. అతని నోటికి టేపు వేయడం, కళ్ల కింద పెన్సిల్‌తో గుచ్చడం వంటి భయంకరమైన పనులు చేసేది. టీచర్ వేధింపులు భరించలేక.. తాను స్కూల్‌కు వెళ్లనని చెప్పి గత 20 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంట్లో కూడా ముభావంగానే ఉంటున్నాడు.
ఈ క్రమంలో తల్లిదండ్రులకు స్కూల్ యాజమాన్యంపై అనుమానం కలిగింది. రెండో తరగతి గదిలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని తల్లిదండ్రులు పరిశీలించారు. విద్యార్థి నోటికి టేపు వేసి, పెన్సిల్‌తో కళ్ల కింద గుచ్చుతున్న దృశ్యాలను పేరెంట్స్ షాక్ అయ్యారు. అన్నెంపున్నెం ఎరుగని బాలుడిని హింసించిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి సంఘాల సహకారంతో స్కూల్ ముందు పెరేంట్స్ ధర్నా నిర్వహించారు. దీంతో స్కూల్ సిబ్బంది ధర్నా చేస్తున్న పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేశారు. దీంతో తీవ్రంగా స్పందించిన పేరెంట్స్ ఈ స్కూల్‌కు కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. ఏడాదికి రూ. 2 లక్షలు ఫీజు వసూలు చేసేది.. ఈ హింస కోసమనా..? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీఈవో, ఎంఈవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు మండిపడ్డారు.