సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): పాత నాణేలకు లక్షల రూపాయలు ఇస్తామంటూ నగరంలో కొత్త దోపిడీ మొదలైంది. సైబర్‌నేరగాళ్లు వృద్ధుల ఆశలను ఆసరాగా చేసుకొని వారిని ఉచ్చులోకి దించి దోచేస్తున్నారు. ఇటీవల నగరంలోని రాంనగర్‌కు చెందిన ఓ 74 ఏళ్ల వృద్ధుడి నుంచి పాతనాణేలకు పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తామంటూ చెప్పిన సైబర్ నేరగాళ్లు అతడి నుంచి రూ.4.27లక్షలు కొట్టేశారు.
ఫేస్బుక్లో ప్రకటన చూసి నాణేలకు డబ్బులు ఇస్తారని నమ్మిన బాధితుడు అందులో పేర్కొన్న నంబర్‌కు కాల్ చేశాడు. మనోజ్‌కుమార్‌తో పాటు మరికొందరు తమకు తాము పరిచయం చేసుకుని బాధితుడి దగ్గర ఉన్న పాతకాయిన్స్కు రూ.72లక్షలు ఇస్తామంటూ నమ్మించారు. ఇందుకోసం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆర్బీఐ ఎన్ఓసీ, ట్రావెల్, లాడ్జింగ్, కొరియర్‌తో సహా ఇతర చార్జీలు ఉంటాయని చెప్పి .. అందుకోసం కొన్ని డబ్బులు పంపాలంటూ సూచించారు. దీంతో బాధితుడు నేరగాళ్లు సూచించిన అకౌంట్‌కు 28సార్లు యూపీఐ ద్వారా రూ.4,72,590లు చెల్లించాడు. డబ్బులు ముట్టిన తర్వాత నేరగాళ్లు స్పందించడం మానేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల రూ.20 నాణానికి రూ.50లక్షలు ఇస్తామంటూ ఆన్లైన్లో ప్రకటన ఇచ్చిన కొందరు.. నగరంలోని దరూల్షిఫా చెందిన ఒక వృద్ధుడిని మోసం చేశారు. పాతనాణేలకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామంటూ చెప్పడంతో బాధితుడు నమ్మాడు. ఆర్బీఐ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని అందుకు కావలసిన ఫా ర్మాలిటీస్ పూర్తిచేయాలని, ఇతర చార్జీలు కలిపి సు మారుగా రూ.2లక్షలు దోచేశారు. ఆ తర్వాత నేరగాళ్లు స్పందించకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఇలాంటి ఘటనలకు సంబంధించి నగరంలో వా రానికి మూడు నుంచి నాలుగు ఫిర్యాదులు వస్తున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి వాటిని నమ్మి చాలామంది మోసపోతున్నారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్స్‌నే టార్గెట్‌గా చేసుకుని సైబర్ నేరగాళ్లు తమ దందా కొనసాగిస్తున్నారు.
పాత నాణేలు ఉంటే తమకు పంపించాలని, వాటికి పెద్ద ఎత్తున ఖరీదు కట్టి ఇస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి.. వాటిని చూసి కాల్ చేసి న వారిని ట్రాప్ చేస్తున్నారు. ఆ తర్వాత వారి దగ్గర నుంచి ముందస్తు చెల్లింపుల పేరుతో డబ్బులు కొట్టేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సైబర్‌నేరగాళ్లు ఎంచుకున్న ఈ కొత్త పంథాతో పోలీసులకు తలనొప్పిగా మారింది. పాతకాలం నాటి నాణేలకు డబ్బు లు ఇస్తామని ఆర్బీఐ ఎక్కడా ప్రకటించక పోయి నా డబ్బుల కోసం ఇటువంటి కేటుగాళ్ల చేతిలో మోసపోవద్దని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.
సోషల్‌మీడియా వేదికగా మోసాలు..
ఫేస్బుక్, ఇన్‌స్టా, వాట్సప్ వేదికలుగా సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్లో యాడ్ ఇచ్చి పాత నాణేలు ఉంటే తమను సం ప్రదించాలంటూ చెప్పడంతో కొందరు వాటిని చూసి మోసపోతున్నారు. ప్రధానంగా కొందరు సీనియర్ సిటిజన్స్‌కు కాయిన్స్ కలెక్షన్ అలవాటుగా ఉంటున్న నేపథ్యంలో వారు ఎక్కువగా ఈ తరహా మోసాలకు గురవుతున్నట్లుగా సైబర్ పోలీసులు తెలిపారు. ఇటువంటి మోసాలకు గురయ్యే క్రమంలో ఆర్బీఐ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకురావాలని కొన్ని ఫేక్ పత్రాలు చూపిస్తే నమ్మవద్దని, ఆర్బీఐ అలాంటి ప్రకటనలు చేయదని వారు పేర్కొన్నారు. పాతనాణేలకు అధిక డబ్బులు ఇస్తామంటూ ఎవరైనా చెబితే వెంటనే తమకు తెలపాలంటూ పోలీసులు సూచించారు.