కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో నిత్యం వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిని తల్లీకొడుకులు అతి దారుణంగా చంపేసిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఆల్కర్ వల్లపీల్ కృష్ణ అనే వ్యక్తి చింతల్లో నివసిస్తున్నాడు. అరుణ(44) అనే మహిళ తన కుమారుడు సాయిరత్నం (16) అద్దెకు దిగారు. వీరితో పాటు అరుణ బంధువు శివారెడ్డి కూడా అదే గదిలో ఉంటున్నాడు. శివారెడ్డి తాగొచ్చి అరుణను ఆమె కుమారుడిని వేధించేవాడు.
ఈ నెల 3న తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. వేధింపులు భరించలేక అరుణ, సాయిరత్నం కలిసి శివారెడ్డిని అంతమొందించేందుకు పన్నాగం పన్నారు. సోమవారం ఇంటి యజమాని కృష్ణకు అద్దె గదిలో గొడవ జరుగుతున్నట్లు సమాచారం అందింది. ఆయన వెళ్లి చూశాడు. గదిలో ఫ్లోర్ మ్యాట్ చుట్టిన మూటను విప్పిచూడగా, అందులో శివారెడ్డి రక్తం మడుగులో శవమై కన్పించాడు. మృతుడి మెడపై పదునైనా ఆయుధంతో దాడి చేసిన గుర్తులు ఉండటంతో నిలదీశారు. అయితే శివారెడ్డి మద్యం తాగి తమను నిత్యం వేధిస్తున్నాడని, ఆ కోపంతోనే తామిద్దం కలిసి అతడిని గొడ్డలితో నరికి చంపామని తల్లీకొడుకులు ఒప్పుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.