ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 8: వందల ఏండ్లుగా పరమత సహనానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్ నగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దారి తప్పిన ఓ వ్యక్తి మసీదుకు చేరుకుంటే.. ముస్లిం పెద్దలు చేరదీసి, చికిత్స చేయించి, బంధువులకు సమాచారం అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో ఉండే ఏఎన్ ప్రసాద్ (59) బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన సాయంత్రం తన భార్య అరుణతో కలిసి బయటకు వెళ్లాడు. ఏటీఎం నుంచి నగదు తీసుకువచ్చేందుకు అరుణ వెళ్లగా తిరిగి వచ్చి చూసేసరికి ప్రసాద్ కనిపించలేదు.దీంతో కంగారుపడిన ఆమె స్నేహితులు, సన్నిహితుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, సోమవారం సాయంత్రం నమాజు సమయంలో చాంద్రాయణగుట్ట మసీదులోకి చేరుకున్న ప్రసాద్ తాను కూడా నమాజు చేసేందుకు ఉద్యుక్తుడవుతుండగా అక్కడ ఉన్న కొంతమంది అతడిని గమనించి ప్రశ్నించారు. మెడలో రుద్రాక్ష, చేతికి కంకణాలు కనిపించాయి. అయినా తాను కూడా నమాజు చేస్తానని చెప్పినప్పటికి, అతడిని పక్కనే కూర్చోబెట్టి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని దవాఖానకు తరలించి, చికిత్స చేయించారు. ప్రసాద్ కోలుకున్నాక అతడి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని ప్రసాద్‌ను తీసుకెళ్లారు. మానవత్వంతో సపర్యలు చేసిన ముస్లింలకు ప్రసాద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.