చార్మినార్/చాంద్రాయణగుట్ట , ఫ్రిబవరి 6 : స్నేహితుల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదం.. మరో స్నేహితుడి హత్యకు దారితీసింది. ఈ ఘటన బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన షాబాజ్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులతో కొంతకాలంగా స్వల్ప వి వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం ముగురు స్నేహితులు వివాదం సద్దుమణిగేలా చర్చలు జరుపుకుందామని స్థానికంగా సమావేశమైయ్యారు.
ఈ క్రమంలో వారిమధ్య మాట మాట పెరగడంతో స్నేహితులు షాబాజ్‌పై కత్తులతో దాడి చేశారు. ఊహించని పరిణామంతో బాధితుడు తేరుకునేలోపు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ మనోజ్‌కుమార్ పరిశీలించి ఇన్స్పెక్టర్కు పలు సూచనలు జారీ చేసి.. నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. కాగా.. షాబాజ్‌ను హత్య చేసిన నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం .