మూసీ సుందరీకరణ మాటున రూ. లక్షన్నర కోట్లు దోచుకునేందుకు మహాత్మాగాంధీ పేరిట మహా మోసానికి తెరతీశారని వక్తలు అన్నారు. పేదల ఇండ్లను కూలుస్తామనంటే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తుందని హెచ్చరించారు. అందరూ కలిసి ఐక్య పోరాటాలు చేసి.. పేదలకు అండగా ఉంటా మని స్పష్టం చేశారు. ‘మూసీ సుందరీకరణపై వాదాలు-వివాదాలు’ అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఫౌండేషన్ అధ్యక్షుడు ఓ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
మూసీ సుందరీకరణ పేరిట సామాన్యులను నిరాశ్రయులను చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. మూసీ సుందరీకరణ ఆలోచన మంచిదే కానీ దాని పేరుతో పేదల ఇండ్లను కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామన్నారు. నగరం అభివృద్ధి పేరిట విధ్వంసం సృష్టించొద్దని హితవు పలికారు. నిరుపేదల ఇండ్లను కూల్చి రోడ్డున పడేస్తే వాళ్లు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ మూసీ మురుగును పారదోలేందుకు ఎస్టీపీలను కట్టారని గుర్తు చేశారు.
దాన్ని కొనసాగిస్తే లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి, పేదల ఇండ్లను కూల్చాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రభుత్వం పేదల ఇండ్లను కూలుస్తామనంటే మాత్రం తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, ప్రొఫెసర్ సీతారామారావు, తెలంగాణ స్టడీ ఫోరం అధ్యక్షుడు శ్రీనివాసాచారి, బీఆర్ఎస్వీ నేతలు పడాల సతీశ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
– సిటీబ్యూరో
విలువైన భూములు దోచుకోవడమే రేవంత్ లక్ష్యం ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలన అంతా ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్, బాపుఘాట్ పరిసరాల్లోనే సాగుతున్నది. అక్కడ విలువైన భూములు ఉన్నాయి కాబట్టి వాటిని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి రూ.కోట్లు కొల్లగొట్టేందుకు పథం రచిస్తున్నారు. నాడు మూసీకి వరదలు వచ్చినప్పుడు నిజాం కూడా ఇండ్లను, కట్టడాలను కూల్చాలనుకుంటే చార్మినార్ కూల్చి, బేగంబజార్, అంబర్‌పేటను ఖాళీ చేయించాలి కదా.
అలా చేయకుండా రిజర్వాయర్లను కట్టి వరదలను కట్టడి చేశారు. సుందరీకరణ పేరిట రూ.లక్షన్నర కోట్లు, విలువైన భూములను దోచుకోవడమే రేవంత్‌రెడ్డి లక్ష్యం’ అని గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. ‘రూ. లక్షన్నర కోట్లు సీఎం రేవంత్‌రెడ్డి అనుకూల కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మహాత్మాగాంధీ పేరిట మహా మోసానికి తెరతీశారు. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీతో డీపీఆర్ తయారు చేయించారు. నదులు, బేసిన్లపై కనీస అవగాహన లేని సీఎం రేవంత్‌రెడ్డి మూసీ నదిపైన కనీస పరిజ్ఞానం లేకుండా నచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 250 కిలోమీటర్లున్న మూసీని కేవలం 52 కిలోమీటర్లు మాత్రమే సుందరీకరిస్తామని అంటున్నారు.
ఆ ప్రాంతంలోనే విలువైన భుములు ఉన్నాయి కాబట్టి ఆయన అనునయులకు ధారాధత్తం చేసి రూ.లక్షన్నర కోట్లు కొల్లుగొట్టేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వాటా ఉన్న మూసీ నదిలో కడ్తున్న ఆదిత్య బిల్డర్స్‌కు అనుమతులిచ్చి.. పట్టా భూముల్లో అన్ని అనుమతులతో కట్టుకున్న పేదల ఇండ్లను కూలుస్తామంటున్నారు. మూసీ పరీవాహకంలో ఒక్క ఇంటిని కూల్చినా ప్రజా ఉద్యమాలతో ప్రభుత్వాన్ని అడ్డుకుంటాం.’ అని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు.