సిటీబ్యూరో/అబిడ్స్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీలో భారీ ఆహార కల్తీ దందా బట్టబయలైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మాంసం మాఫియా గుట్టును బుధవారం పోలీసులు రట్టు చేశారు. మంగళహాట్ కేంద్రంగా సాగుతున్న ఈ దందాను గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్, హెచ్‌ఫాస్ట్, జీహెచ్ఎంసీ టీం సంయుక్తంగా నిర్వహించిన మెరుపుదాడుల్లో వెలుగులోకి తెచ్చారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు మంగళ్‌హాట్ కిస్తీచమన్ ప్రాంతంలో ఓ దుకాణంపై దాడులు చేసి అక్కడ చూసిన దృశ్యాలకు షాక్ అయ్యారు. రెండు భారీ గోదాముల్లో నిల్వ ఉంచిన సుమారు 1000 కిలోల కుళ్లిపోయిన మేక, గొర్రె మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ దందా వెనక ఉన్న సూత్రధారి అఫ్రోజ్ అనీ, ఇతను జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి చనిపోయిన మేకలు, గొర్రెలను తక్కువ ధరకు తెప్పిస్తున్నట్లు మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. కనీసం స్టోరేజ్ లైసెన్స్ కూడా లేకుండా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఈ మాంసాన్ని నిల్వ చేస్తూ డీప్ ఫ్రీజర్‌లో నిల్వ ఉంచి రసాయనాలతో తాజాగా మార్చి నగరంలో పలు శుభకార్యాలు, అనేక రెస్టారెంట్లు, బిర్యానీ హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా..కీలక నిందితుడు అఫ్రోజ్ ఇందులో ఉన్నాడు.
గతనెల 12న అఫ్రోజ్‌కు సంబంధించిన ఏటూ జడ్ అండ్ గోట్ అఫల్స్ దుకాణంలో 300 కేజీ మేక, గొర్రెల విడిభాగాలు, పెద్ద ఎత్తున మాంసం నిల్వలు దొరికాయి. అప్పట్లో అప్రోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, అతడు మళ్లీ బయటకు వచ్చి అదే దందా నడుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. అఫ్రోజ్ మారకుండా అదే కల్తీ దందా కొనసాగించడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం మరోసారి ఆయన గోదాములపై రైడ్ చేయడంతో మొత్తం బండారం బయటపడింది. ఒకసారి అరెస్టయిన వ్యక్తి విడుదలైన తర్వాత మళ్లీ అదే దందా కొనసాగించడంపై పోలీసులు ఆశ్చర్చపోతున్నారు.
అమర్నగర్కు చెందిన అఫ్రోజ్ తన దుకాణంలో కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసం అమ్ముతున్నారు. ఆహారప్రియుల అవసరమే అదనుగా చాలామంది వ్యాపారులు కుళ్లిన మాంసాన్ని విక్రయించి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ చరిత్రలోనే ఇది పెద్ద జాయింట్ ఆపరేషన్‌గా నిలిచింది.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఇలాంటి వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. మాంసం కొనేముందు వినియోగదారులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటనలో సదరు గోదాములను సీజ్ చేసిన అధికారులు నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. కుల్సుంపురా ఏసీపీ తిరుపతి పర్యవేక్షణలో నిందితులపై కేసు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
వ్యాపారస్తులతో సీపీ సమావేశం..
బుధవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన వివిధ రకాల వ్యాపారస్తులతో సమావేశమయ్యారు. కల్తీపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున కల్తీలు జరగడం వల్ల నగర ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతున్నదని, వెంటనే కల్తీ చేయడం ఆపేయాలని, కల్తీ వస్తువులు అమ్మకూడదని చెప్పారు. సమావేశానికి సుమారు 2వందల మంది హాజరుకాగా, కల్తీ లేకుండా వస్తువులు అమ్మాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా కల్తీ చేసినట్లు సమాచారం వచ్చినా, వారి దగ్గర కల్తీ వస్తువులు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.