మలక్‌పేట, ఆగస్టు 28: మద్యం మత్తులో మూసీలో ఈత కొడతానంటూ దిగిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శంకర్‌నగర్‌కు చెందిన మహ్మద్ సలీం(32) కూలీ. గురువారం సాయంత్రం పూటుగా మద్యం సేవించిన సలీం.. మూసీలో ఈత కొడతానని శంకర్‌నగర్ హనుమాన్ టెంపుల్ వద్ద మూసీలోకి దూకాడు.
వరద ప్రవాహం ఉధృతంగా ఉండటం, దూకినచోట లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయాడు. స్థానికులు చాదర్‌ఘాట్ పోలీసులకు సమాచారం అందించటంతో ఇన్స్పెక్టర్ బ్రహ్మ మురారి వెంటనే సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి గాలింపు చేపట్టారు. పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించినప్పటికీ మృతదేహం లభించలేదు. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో అందులో కొట్టుకుపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.