కీసర, జూలై 8: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలైన సంఘటన కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కీసర పోలీసుల కథనం ప్రకారం.. నారపల్లికి చెందిన షేక్ బాసవత్ టెంట్ హౌజ్ నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. షేక్ బాసవత్ స్నేహితుడైన స్వామి(32)తో కలిసి పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై నాగారం వైపు వస్తున్నాడు. రాంపల్లి చౌరస్తా నుంచి యానంపేట్ వరకు ఘట్కేసర్ ప్రధాన రహదారి పనులు జరుగుతున్నాయి.
ఈ రోడ్డులో పూర్తిగా కంకర పోయడంతో ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడిపోయారు. దీంతో అతివేగంగా వచ్చిన లారీ టైర్ కింద పడిపోయాడు. తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి స్నేహితుడికి బలమైన గాయాలయ్యాయి. మృతి చెందిన షేక్ బాసవత్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఈ కేసును కీసర పోలీసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయింది
ఈ రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన నడుస్తున్నాయి. ఈ రోడ్డుకు ఇరువైపులా కంకర పోసి వదిలేయడంతో ఈ రోడ్డు ప్రయాణికులకు పెద్ద ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసి కాంట్రాక్టర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానికులందరూ ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే ఈ రోడ్డు పనుల్లో తీవ్ర జాప్యం జరగడం, దానికి తోడు ఈ రోడ్డులో చాలా రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలా మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.