శేరిలింగంపల్లి, మార్చి 21: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండలో నివాసం ఉంటున్న కాశీ శివకుమార్ (35) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం 6:50 గంటల సమయంలో ఖాజాగూడ నుంచి గండిపేట వైపు బైక్‌పై పి.దివాకర్ అనే వ్యక్తితో కలిసి వెళ్తున్నాడు.
మార్గమధ్యలో నానక్‌రాంగూడ సర్కిల్ ఫ్రీ లెఫ్ట్ టర్న్ వద్ద వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం శివకుమార్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనం నడుపుతున్న శివకుమార్ తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందాడు. దివాకర్‌కు తీవ్ర గాయాలు కాగా అతన్ని మెడికవర్ హాస్పిటల్‌కు తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు (టీజీ07ఎక్స్3199)గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.