చాంద్రాయణగుట్ట, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): గణేశ్ మండపం వద్ద బ్యానర్ సరిచేస్తుండగా.. విద్యుత్ షాక్ కొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. రవీంద్రనాయక్ నగర్ బంజారా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని చూసేందుకు స్థానికంగా నివసించే ఆటో డ్రైవర్ కేతావత్ భరత్ (33) వెళ్లాడు. మండపం వద్ద ఏర్పాటు చేసిన బ్యానర్‌ను సరిచేయడానికి స్థానికంగా ఉన్న ఇంటిపైకి ఎక్కాడు.
ఇంటిపై ఉన్న ఇనుపరాడ్‌ను తీసే క్రమంలో ఆ ఇంటిపై నుంచి వెళ్లిన హై టెన్షన్ తీగలకు ఇనుపరాడ్ తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌తో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు హుటహుటిన ఇంటిపైకి వెళ్లి చూడగా…అప్పటికే భరత్ మృతి చెందాడు. భరత్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వెంటనే స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇంటిపై నుంచి హై టెన్షన్ వైరు వెళ్లడం కారణంగానే భరత్ మరణించాడని, అతడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి సర్కార్ తరఫున రూ. 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని, జంగమ్మెట్‌లో నిర్మించిన డబూల్ బెడ్రూం ఇండ్లలో ఓ ఇంటిని కేటాయించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీపీఎం సీనియర్ నాయకుడు ఎ. కృష్ణ నాయక్ డిమాండ్ చేశారు. ఫలక్‌నుమా ఇన్స్‌స్పెక్టర్ ఆదిరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.