ఎర్రగడ్డ, ఏప్రిల్ 1: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోరబండ పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన రఘు (49) కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా బోరబండలో ఉంటూ.. ఓ టీవీ చానల్లో రిపోర్టర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతడు కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నాడు. మనస్తాపానికి గురైన అతడు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఇంటికి వచ్చి చూడగా.. రఘు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. చికిత్స నిమిత్తం అతడిని మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దుండిగల్, ఏప్రిల్ 1: మానసిక సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూరారం పోలీసుల కథనం ప్రకారం.. సూరారం కాలనీలోని రాజీవ్‌గృహకల్ప సముదాయంలో ఉంటున్న దత్తు (30) కూలీ. అతడి వివాహం ఏడాది కిందట జరిగింది. కొద్ది రోజులుగా అతడు మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో రెండు నెలలుగా కూలీ పనులకు కూడా వెళ్లడంలేదు. దీంతో కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం తెల్లవారు జామున కూడా ఇదే విషయంపై భార్య, తల్లితో గొడవ జరిగింది. కోపంతో అతడు ఇంటిలో కూరగాయలు కోసే కత్తితో మణికట్టు వద్ద చేతిని కోసుకున్నాడు. ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
మేడ్చల్, ఏప్రిల్ 1: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్‌లో జరిగింది. బాలానగర్‌కు చెందిన పొట్టు నరేందర్(42) మందుల దుకాణంలో పని చేస్తున్నాడు. కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఇంటికి దూరంగా ఉంటున్నాడు. దాదాపు 20 రోజుల నుంచి కుటుంబానికి సంబంధం లేకుండా ఉన్నాడు. ఆదివారం మేడ్చల్ పట్టణంలో ఉన్న ఓ లాడ్జికి వచ్చాడు. అక్కడి నుంచి తన భార్యకు ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన ఆమె.. పోలీసులతో కలిసి లాడ్జికి వచ్చింది. అప్పటికే క్రిమిసంహారక మందు తాగిన నరేందర్ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.