Hyderabad | దుండిగల్, ఏప్రిల్ 20: ప్రభుత్వ భూములను ఆక్రమించుకునేందుకు ఓ వ్యక్తి పెద్ద కుట్ర చేశాడు. ఇందుకోసం అడ్డదారిలో కరెంటు మీటర్లను పొంది ఒకే గదిలో దాచిపెట్టాడు. అయితే ఒకే గదిలో 30 వరకు కరెంటు మీటర్లు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడి చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండిమైసమ్మ ఏరియాలోని పల్లవి ఆశ్రమం దగ్గర గల ప్రభుత్వ భూమిలో ఉన్న ఓ గదిలో పెద్ద మొత్తంలో గృహ వినియోగానికి ఉపయోగించే కరెంటు మీటర్లు డంపింగ్ చేసినట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏఈ సాయి, ఎలక్ట్రిక్ సిబ్బందితో కలిసి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీలో ఒకే గదిలో 30 ఎలక్ట్రిక్ మీటర్లు లభించాయి. వేణుగోపాల్ అనే వ్యక్తి గత రెండేండ్ల నుంచి బిల్లులు చెల్లిస్తూ ఈ కరెంటు మీటర్లను సేకరించినట్లు తెలిసింది.
ఎటువంటి ఇంటి నంబర్లు, సరైన పత్రాలు లేకపోవడంతో పాటు ఎటువంటి అనుమతులు పొందుపరచకుండానే నెల నెల బిల్లులు చెల్లిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని.. ఎలక్ట్రిక్ మీటర్ల సాయంతో రెగ్యులరైజేషన్ చేసుకునేందుకు కుట్రపూరితంగా దాచిపెట్టినట్లుగా సీఐ సతీశ్ తెలిపారు. నిందితుడు వేణుగోపాల్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. కాగా, విద్యుత్ శాఖ సిబ్బంది సైతం ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు తెలిసిందని అన్నారు.