Love Attack | శేరిలింగంపల్లి, ఆగస్టు 29: గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి మృతిచెందగా, అడ్డుకున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నిందితుడు సైతం విద్యుత్ తీగలను పట్టుకొని ఆత్మహత్యకు యత్నించి..ప్రాణపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కోచ్బీహార్ జిల్లా, లంకపార గ్రామానికి చెందిన దీప్నా తమాంగ్(26) గోపన్పల్లితండాలో మరో ముగ్గురు యువతులతో కలిసి అద్దెకుంటున్నది. ఓ బ్యుటిపార్లర్లో బ్యుటిషియన్‌గా పనిచేస్తున్నది.
బెంగళూర్‌లో పనిచేసిన సమయంలో బీదర్‌కు చెందిన రాకేశ్(25)తో పరిచయం ఏర్పడింది. అతడు కూడా మాదాపూర్‌లోని హాస్టల్లో ఉంటూ.. మరో బ్యూటీపార్లర్‌లో పనిచేసేవాడు. ఇద్దరు మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొంతకాలంగా దీప్నా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదనే కారణంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి గోపన్‌పల్లి తండాలోని దీప్నా తమాంగ్ నివసిస్తున్న ఇంటికి వచ్చిన రాకేశ్.. మాట్లాడాలంటూ.. బయటకు పిలిచాడు.
అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో దీప్నాతమాంగ్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 15 కత్తిపోట్లకు గురైన దీప్నా.. రక్తపుమడుగులో పడిపోయింది. అరుపులు విని అడ్డుకునేందుకు యత్నించిన ఆమె స్నేహితులు సావిత్రి, పునీత, కృష్ణ తమాంగ్లపై సైతం రాకేశ్ దాడి చేసి.. పరారయ్యాడు. బాధితుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దీప్నాతో పాటు ఆమె స్నేహితులను హాస్పటల్‌కు తరలించారు.
అయితే అప్పటికే దీప్నా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దాడి అనంతరం రాకేశ్ బీదర్‌లో ఉంటున్న తన తల్లిదండ్రులకు ఇదే తన చివరి రోజు అంటూ మెసేజ్ పెట్టాడు. దీంతో రాకేశ్ తల్లిదండ్రులు కర్ణాటక పోలీసులను అశ్రయించారు. వారు ఇచ్చిన సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు రాకేశ్ కోసం గాలించగా, మొయినాబాద్‌లో అతడి సెల్‌ఫోన్ సిగ్నళ్లను గుర్తించారు. అక్కడికి వెళ్లి చూసేసరికి విద్యుత్ తీగలను పట్టుకొని సగం కాలిన గాయాలతో రాకేశ్ కనిపించాడు. నిందితుడిని చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేపట్టారు.