సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): చెట్ల కొమ్మల కత్తిరింపు యంత్రాల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంపై శనివారం టీజీఎస్పీడీసీఎల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రధానంగా చెట్ల కొమ్మలను కత్తిరించేందుకు ట్రీప్రూనర్లు, పోల్ప్రూనర్లు, చైన్సాలు కొనుగోలు చేసే సమయంలో ఒక్క కంపెనీనే ఎంపిక చేసుకుని, ఆ కంపెనీకి సంబంధించిన డీలర్ ద్వారానే కొనుగోళ్లు జరిపినట్లుగా దక్షిణ డిస్కం స్వయంగా ప్రకటించింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఈ యంత్రాలను తీసుకొని రావడం, అందులోనూ పెట్రోల్‌తో నడిచే యంత్రాల స్థానంలో ఆధునిక సాంకేతికతతో ఉంటుందంటూ బ్యాటరీతో నడిచే యంత్రాలను ఖరీదు చేయడం స్వాగతించాల్సిందే అయినా ఈ వ్యవహారంలోనే అక్రమాలు చోటు చేసుకున్నాయని డిస్కం అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు.
‘నమస్తే తెలంగాణ’ కథనం నేపథ్యంలో టీజీఎస్పీడీసీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది. చెట్ల కత్తిరింపు యంత్రాలకు సంబంధించి ఎక్కడా అవకతవకలు జరగలేదని, జీఎస్టీతో కలిపి రేట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని, యంత్రాల కొనుగోళ్ల తర్వాత తిరిగి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో వెనక్కు వస్తుంది కాబట్టి రేటును తక్కువగా చూడాలంటూ చెప్పింది. సంస్థ కొనుగోలుచేసిన పరికరాలు సాధారణ గృహ వినియోగానికి సంబంధించినవి కాకుండా విద్యుత్ పంపిణీ సంస్థల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఇండస్ట్రియల్ గ్రిడ్ పరికరాలని తెలిపింది.
పోల్ప్రూనర్ ఫీడర్ నిర్వహణ మరియు చెట్ల కొమ్మల తొలగింప పనుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన బ్యాటరీ ఆధారిత పరికరమని, తక్కువ బరువు ఉండడంతో ఫీల్డ్ సిబ్బంది సులువుగా వినియోగిస్తున్నారని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ పరికరం సుమారు 55 నిమిషాలు పనిచేస్తుందని, అదనపు బ్యాటరీల సహాయంతో రెండు నుంచి మూడుగంటల వరకు పనిచేస్తుందని డిస్కం తెలిపింది. ఈ మోడల్‌కు సంబంధించి 168 యంత్రాలను ఆర్డర్ చేయగా, ఇప్పటికే కొంత సరఫరా పూర్తయిందని, మిగతా యంత్రాలను తయారీ సంస్థ మరో వారంలో అందించనున్నట్లు తెలిపింది. ఈ పరికరాలన్నీ జర్మనీలో తయారైనవని వారు పేర్కొన్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది..!
విద్యుత్ సంస్థలు తాము ఎమర్జెన్సీ కాలంలో కొనుగోళ్లు చేయడానికి అత్యవసరంగా పనులు చేపట్టడం సహజమే అయినా ఈ చెట్ల కత్తిరింపు యంత్రాల కొనుగోలు విషయంలో అత్యవసరం అంటూనే ఆ నిబంధనలను తుంగలో తొక్కారు. వర్షాకాలం ప్రారంభం తర్వాత పరికరాలను కొనే ప్రక్రియ మొదలుపెడతారా.. ఒకవేళ కొనుగోలు చేసినా ఎలాంటి టెండర్ లేకుండా, నాలుగైదు కంపెనీల పరికరాలు, వాటి నాణ్యత, ఖరీదు పరిశీలించకుండానే నేరుగా ఒక డీఈ, మరో అధికారి కలిసి ముంబైకి వెళ్లి అక్కడ తమకు నచ్చిన కంపెనీతో మాట్లాడుకుని రావడం వెనక ఆంతర్యమేంటనే ప్రశ్న తలెత్తుతోంది.
తమకు నచ్చిన, తమకు కలిసివచ్చే కంపెనీ యంత్రాలను కొనుగోలు చేసే క్రమంలో ఆ యంత్రాలు కూడా పూర్తిగా అందుబాటులోకి రాకపోగా మరో వారంలో అందిస్తారని డిస్కమే తన ప్రకటనలో పేర్కొంది. వర్షాలు ప్రారంభమై తీవ్ర రూపం దాల్చిన తర్వాత యంత్రాలు అప్పటికి కూడా అందుబాటులోకి వస్తాయో లేదో తెలియదని, అవికూడా జర్మనీలో తయారీ అంటూ ఆర్భాటంగా ప్రకటించుకున్న కంపెనీ సదరు డీలర్‌తో చేసుకున్న ఒప్పందంలో ఏ సమయానికి పరికరాలు అందించాలో చెప్పినా డీలర్ సరఫరా చేయడంలో విఫలమయ్యారా అనే ప్రశ్న తలెత్తుతోంది.
ముందస్తుగానే అడ్వాన్స్ రూపంలో డబ్బులు చెల్లింపులు జరిగినా పరికరాలు రాలేదంటే ఇందులో మతలబేంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే సదరు కంపెనీపై మక్కువా లేక డీలర్‌తో కుదిరిన ఒప్పందాలా ఏదేమైనా ఒకటే కంపెనీ కొటేషన్‌తో కోట్ల రూపాయల వస్తువులు కొనుగోళ్లు చేయడం ఎంతవరకు సమంజసమని, ఒకవేళ ఈ పరికరాలు కావాలంటూ ఎమర్జెన్సీ టెండర్లు పిలిచినా ఒకట్రెండురోజుల్లో వేయడానికి నాలుగైదు కంపెనీలు సిద్ధంగా ఉండేవని, వాటన్నింటినీ కాదని కేవలం ఒక్క కంపెనీకి అదికూడా ఒక డైరెక్టర్‌కు చాలా సన్నిహితమైన వ్యక్తి డీలర్‌గా ఉన్న కంపెనీకి అప్పగించడం వెనక మతలబు ఏంటంటూ ఒక సీనియర్ అధికారి ప్రశ్నిస్తున్నారు.
ధరల విషయంలోనూ మిగతా కంపెనీలతో పోలిస్తే ఈ ధరలు ఎక్కువగా కనిపిస్తుండగా, ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ధరల విషయంలో చాలా తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ విషయంలోనూ ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్న సమాధానాలు ఏ మాత్రం పొంతన లేకుండా ఉండడం గమనార్హం. దీనిపై ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని, ఆ డైరెక్టర్ కారణంగానే ఈ అవకతవకలు జరుగుతున్నాయని, మరోవైపు ట్రాన్స్ఫార్మర్ల కొనుగోళ్లలో కూడా ఇదే తరహా వ్యవహారం నడిపించే ప్రయత్నం జరుగుతున్నదంటూ మింట్ కాంపౌండ్‌లో చర్చ జరుగుతోంది.
వచ్చే వారంలో వీటిపై శిక్షణ ఇస్తారట..!
పరికరాలు రావడమే ఆలస్యం.. వచ్చినా కొన్ని మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా సరిగా వినియోగించడం తెలియక క్షేత్రస్థాయి సిబ్బంది ఇబ్బంది పడుతుంటే డిస్కం ఉన్నతాధికారులు తాపీగా వచ్చేవారం కంపెనీ ప్రతినిధులు వచ్చి శిక్షణాతరగతులు నిర్వహిస్తారంటూ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని విద్యుత్‌శాఖ అధికారులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. చెట్ల కొమ్మలు తొలగించే క్రమంలో ఆ పరికరాలు నాసిరకంగా ఉన్నాయని, మొదలు పెట్టగానే ఆగిపోతున్నాయని, మళ్లీ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తున్నదని, కొమ్మలు కత్తిరిస్తుంటే మధ్యలోనే ఆగిపోవడంతో మళ్లీ మొదలుపెట్టడం ఇబ్బందిగా ఉందంటూ క్షేత్రస్థాయి సిబ్బంది తలలు బాదుకుంటున్నారు.
అయినా వారి బాధలేవీ ఉన్నతాధికారులకు కనిపించడం లేదని, కేవలం కమీషన్ల కోసం ఒక డైరెక్టర్ చేసిన పని వల్ల తాము ఇంతగా ఇబ్బందులు పడుతున్నామంటూ సిబ్బంది ఆరోపిస్తున్నారు. తాము కొనుగోలు చేసిన పరికరాలను డిస్కం ఉన్నతాధికారులు సరిగ్గా పరిశీలించకుండానే క్షేత్రస్థాయిలో అప్పగించి అక్కడ సిబ్బంది పడుతున్న అవస్థలు ఎందుకు చూడడం లేదని, సాంకేతికంగా చాలా గొప్పవారమంటూ ఫీలయ్యే డిస్కంలో కొందరు అధికారులు తాము కొనుగోలు చేసిన పరికరాలకు గ్యారెంటీ అంత తక్కువ సమయమే ఉండేలా చూసుకోవడం వెనక ఆంతర్యమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. బ్యాటరీలు, పరికరాలు కొనుగోలుచేసేటప్పుడు కనీసం సంవత్సరం నుంచి రెండుసంవత్సరాలైనా గ్యారెంటీ ఉండాలని కోరుకుంటారని, కానీ ఆరునెలలకే ముగిసే గ్యారెంటీతో కొనుగోలు చేసిన పరికరాలు మళ్లీ వచ్చే సంవత్సరానికి ఎలా పనిచేస్తాయంటూ క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.