సిటీబ్యూరో, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : చెరువుల పరిరక్షణలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక పై గజం స్థలం కూడా కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 4జీ/5జీ సిమ్ బెస్డ్తో 1170 చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించారు.ఈ నెల 4న గడువు విధించగా..వారం రోజుల్లో సంబంధిత ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించి రెండేండ్ల పాటు నిర్వహణ చేపట్టనున్నారు.
సంబంధిత చెరువుల్లో ఎలాంటి చెత్త డంపింగ్ వేయకుండా, వేసిన వారిని గుర్తించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం, కబ్జాలకు పాల్పడే వారి పై కఠినంగా వ్యవహరించేందుకు ఈ విధానం సులువుగా ఉంటుందని అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో జీహెచ్ఎంసీకి సంబంధించి 185 చెరువులను పరిరక్షించి, పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారు.
ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) నిర్ధారణ, చెరువు భౌగోళిక స్వరూపం, సర్వే నంబర్లు, విస్తీర్ణం, ప్రాంతం, రెవెన్యూ మండలం వివరాలపై సమగ్ర స్థాయిలో అధికారులు సర్వే చేస్తున్నారు. ఇరిగేషన్, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖలతో కలిసి ఫైనల్ జాబితా తయారు చేసిన తర్వాత జీహెచ్ఎంసీ వెబ్సైట్లో చెరువు వివరాలను పొందుపర్చనున్నారు. ప్రజాక్షేత్రంలో ఎఫ్టీఎల్ హద్దు మ్యాప్‌ల అంతిమ నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి హెచ్ఎండీఏను నోడల్ ఏజెన్సీగా నియమించుకొని జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతున్నది.
చెరువుల సంరక్షణ కమిటీ వెబ్సైట్లో 157 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేయగా… మరో 28 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. కాగా ఇటీవల చెరువుల పరిరక్షణలో ఎఫ్టీఎల్ పరిధిలో 8718 అక్రమ నిర్మాణాలు , బఫర్ జోన్లో 5353 నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. 51 చెరువుల్లో ఆక్రమణలు లేవని స్పష్టం చేశారు. 30 చెరువుల్లో 85 శాతం ఆక్రమణలు ఉండగా, 104 చెరువుల్లో 15 శాతం ఆక్రమణలు ఉన్నట్లు తేలింది. ఎఫ్టీఎల్/బఫర్ జోన్ పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగిస్తామని, ఆక్రమణలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
సీసీ కెమెరాల బిగింపు వివరాలు..
జోన్ : సీసీ కెమెరాల ఏర్పాటు
ఎల్బీనగర్ : 153
శేరిలింగంపల్లి : 318
చార్మినార్ : 142
కూకట్పల్లి : 383
ఖైరతాబాద్ : 142
సికింద్రాబాద్ : 32
మొత్తం : 1170