సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : మెట్రో విస్తరణలో కీలక నిర్ణయం ఉంటుందని, పలు ప్రాంతాలకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ధృఢ నిశ్చయంతో ఉన్నదని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి అన్నారు. ఇప్పటికే ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులు మొదలైనట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, హెచ్ఏఎంఎల్ అధికారులు ప్రభావిత ఆస్తుల యజమానులతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారన్నారు. అందుకు అనుగుణంగా సేకరించే ఆస్తుల నష్టపరిహారం చదరపు గజానికి రూ. 81వేల చొప్పున చెల్లిస్తామన్నారు. శనివారం బేగంపేటలోని ఓ హోటల్లో ర్యాపిడో, మెట్రో రైల్‌తో ఒప్పందం చేసుకున్నది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్వీఎస్రెడ్డి అనంతరం మాట్లాడారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నిర్ణయించిన పరిహారానికి అనుగుణంగా భూ యజమానులు కొందరు తమకు అంగీకార పత్రాలను అందజేశారని, వారికి 10 రోజుల్లోగా పరిహారం చెక్కు రూపంలో చెల్లిస్తామని స్పష్టం చేశారు. మిగిలిన ఆస్తుల యజమానులు కూడా వీలైనంత త్వరగా అంగీకార పత్రాలను హెచ్ఏఎంఎల్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఇప్పటివరకు 800 ఆస్తులకు సంబంధించిన స్పష్టత వచ్చిందని, మిగిలిన 300 ఆస్తులపై చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రయాణికులకు మెరుగైన రవాణా..
నగరంలో మెట్రో విస్తరణపై పలు అభ్యర్థనలు వస్తున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫేస్-2 అలైన్‌మెంట్‌పై కీలక ప్రకటన చేస్తారని ఎండీ పేర్కొన్నారు. నగరంలో వేగంగా మెట్రో విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యంగా నగరంలో లాస్ట్ మైల్ కనెక్టివిటీని అందించేందుకు ఎల్ అండ్ టీ, మెట్రో రైల్ హైదరాబాద్‌తో, ర్యాపిడో ఒప్పందం కుదుర్చుకున్నది.దీని ద్వారా హైదరాబాద్‌లో అర్బన్ మొబిలిటీ ఇంకా మెరుగుపడే అవకాశం ఉందన్నారు. క్లిష్టమైన మొదటి, చివరి మైలు కనెక్టివిటీ అత్యంత క్లిష్టమైందన్నారు. ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడంలో తాము కట్టుబడి ఉన్నామన్నారు.
ర్యాపిడో సేవలు అత్యంత కీలకం
మెట్రో ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడంలో ర్యాపిడో సేవలు అత్యంత కీలకమని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 57 మెట్రో స్టేషన్ల పరిధిలో ప్రయాణించే వినియోగదారులకు కేవలం రూ. 30 నుంచి చార్జీలు మొదలవుతాయన్నారు. ప్రతినెల 2 లక్షల కంటే ఎక్కువ స్థానిక బైక్, టాక్సీ రైడర్లను ర్యాపిడో నియమించడం ద్వారా సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 2.7 లక్షల రోజువారీ రైడ్లు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీవోవో మురళీ వరదరాజన్, ర్యాపిడో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ పవన్ దీప్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.