శంషాబాద్ రూరల్, నవంబర్ 6 : దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వీహెచ్‌పీ, అఖిలపక్షం డిమాండ్ చేసింది. బుధవారం శంషాబాద్‌లో వీహెచ్‌పీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్టు కాలనీ హనుమాన్ దేవాలయంలోని నవగ్రహా విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి పాత పోలీస్‌స్టేషన్, పాత శంషాబాద్, తహసీల్దార్ కార్యాలయం, మహావీర్కాలనీ, ఆర్బీనగర్, మధురానగర్ కాలనీల మీదుగా శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏసీపీ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలయంలో ధ్వంసం చేసిన విగ్రహాలను రాష్ట్ర ప్రభుత్వమే పునర్ నిర్మాణం చేయాలన్నారు. దాడులు నిర్వహించి హిందువుల మనోభావాలను దెబ్బతిస్తున్న వారిని శిక్షించే వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ర్యాలీలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ సతీశ్, మోహన్‌రావు, శ్రీనివాస్, రాజేందర్, కొన్నమొల్ల శ్రీనివాస్, వేణుగోపాల్, బీజేవైం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్, కుమార్, నందకిశోర్, కౌన్సిలర్లు వెంకటేశ్, అమృతారెడ్డిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ వీహెచ్‌పీతో పాటు అఖిలపక్షం బంద్‌కు పిలుపునివ్వడంతో పాఠశాలలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించినట్లు సీఐ బాలరాజు తెలిపారు.