పీర్జాదిగూడ, జనవరి 4: విద్యుదాఘాతంతో ఓ ఎలక్ట్రికల్ బైక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రికల్ బైక్‌లు, వాటి విడి భాగాలు బుగ్గి పాలు కాగా సుమారు రూ.8 కోట్ల నష్టం జరిగింది. ఈ ప్రమాదం శనివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి పీర్జాదిగూడలో జరిగింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణానగర్ కాలనీలోని వర్స్ గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలక్ట్రికల్ బైక్ గోదాంలో శనివారం సాయంత్రం షార్ట్‌సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాంలో బైక్‌లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలకు అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 కోట్ల నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు.