మియాపూర్, మార్చి 30: ఆస్తిపన్ను బకాయి ఉన్న ఓ వాణిజ్య దుకాణంపై చందానగర్ సర్కిల్ పన్ను విభాగం అధికారులు దారుణానికి ఒడిగట్టారు. పలుమార్లు నోటీసులిచ్చినా యజమాని స్పందించకపోవడం తో, దుకాణం ఎదుట జేసీబీతో గుంత తవ్వా రు. ఓ వైపు బట్టల వ్యాపారం కొనసాగుతుండగా శనివారం మధ్యాహ్నం ఆకస్మికంగా వచ్చిన అధికారులు.. దుకాణం ఎదుట బయటికున్న షెడ్డును తొలగించారు. రెండు అడుగుల మేర పెద్ద గుంతను తవ్వారు. కొనుగోలుదారులకు ఇబ్బందులు కలిగించారు.
సిబ్బంది, యజమాని బతిమాలినా వినిపించుకోలేదు. దీంతో దుకాణదారు బోరున విలపించాడు. ఉగాది రోజునే అధికారులు ఈ పనికి ఒడిగట్టడం గమనార్హం. అనంతరం యజమాని అధికారులను కలిసి పన్ను చెల్లింపు చేసినట్లు తెలిసింది. కాగా తీసిన గుంతను తిరిగి ఆదివారం దుకాణదారుడు సిబ్బంది తోడ్పాటుతో తిరిగి పూడ్చివేశారు.
అయితే ఇంతటి విపరీతమైన చర్యకు దిగిన పన్ను విభాగం అధికారులపై ఉన్నదాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే సర్కిల్లో మాదాపూర్ పరిధిలో వాణిజ్య భవనంపై రూ.20 లక్షలకు పైగా పన్ను బకాయి ఉండడంతో సీజ్ చేశారు. కానీ గుంతను తవ్వడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చర్య జీహెచ్ఎంసీ ప్రతిష్టను దిగజార్చేలా ఉందని విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది.