ఉస్మానియా యూనివర్సిటీ: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు బకాయిలు, స్కాలర్షిప్లు విడుదల చేయడంలో విఫలమైందన్నారు. అలాగే రాష్ట్రంలో విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం విచారకరమన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పైవేట్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు. ఫీజు నియంత్రణ కమిటీని నియమించి, బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను జూన్ మొదటి వారం లోపు విడుదల చేయనిపక్షంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు.. ఏల్పుకొండ రామకృష్ణ, సంతోష్, మహేష్, నిఖిల్, గౌతమ్, సతీష్, హుస్సేన్, దామోదర్, హరీష్, పాషా, శ్రవణ్, వేణు, మహేష్, అనిల్, రాజేష్, వెంకటేష్, రాహుల్, నర్సింహ, రాము, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.