హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో ఘోరం జరిగింది. కార్ఖానాకు చెందిన ఓ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ధీరజ్, రితేశ్ అనే ఇద్దరు యువకులు.. ఇన్స్టాగ్రామ్లో ఓ బాలికను పరిచయం చేసుకున్నారు. ఆమెతో ఆ ఇద్దరు యువకులు తమపై ఓ మంచి అభిప్రాయం ఏర్పడేలా చాటింగ్ చేశారు. ఆ తర్వాత బాలికకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు. అయితే ఆ సమయంలో ఆమెకు తెలియకుండా వీడియోలు తీశారు. ఆ వీడియోలను అడ్డుగా పెట్టుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారు.
వీడియోలు ఇస్తామని ఇటీవల బాలికను పిలిచి మరోసారి తన స్నేహితులతో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక మానసికంగా కుంగిపోయింది. ఈ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఆమెను మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. తనకు జరిగిన అవమానాన్ని మానసిక వైద్యుడికి చెప్పింది. దీంతో బాలిక పేరెంట్స్ మే 30వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. నలుగురి యువకులను రిమాండ్కు తరలించారు. మరో బాలుడిని జువైనల్ హోంకు తరలించారు.