Hyderabad | బంజారాహిల్స్, మే 14 : పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడడంతో పాటు డబ్బులు తీసుకుని ఉడాయించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన యువతి(28) ఎంబీబీఎస్ పూర్తిచేసి కాస్మోటాలజీలో స్పైషలేజేషన్ చేసింది. బంజారాహిల్స్‌లోని ఓ సంస్థలో స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్‌గా ఆరునెలల క్రితం చేరింది. అదే సంస్థలో హెచ్ఆర్ హెడ్‌గా పనిచేస్తున్న భరత్(33) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించడంతో పాటు పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
కొన్నాళ్ల తర్వాత వీరిద్దరినీ ఉద్యోగంలో నుంచి తీసేయడంతో బంజారాహిల్స్ రోడ్ నెం 14లో సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. దీనికోసం యువతి వద్ద నుంచి భరత్ సుమారు రూ.2.5లక్షలు తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లిపేరుతో పలుమార్లు లైంగికంగా వాడుకున్నాడు.
కాగా ఇటీవల భరత్‌కు ముందే పెళ్లయిందని తేలడంతో అతడు నివాసం ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లి చూడగా ఆరునెలల గర్భంతో ఉన్న భార్య కనిపించింది. తన భర్త తప్పు చేశాడని, అతడిని వదిలిపెట్టాలని ఆమె కోరింది. ఈ ఘటన తర్వాత భరత్ హైదరాబాద్ నుంచి పుణె వెళ్లిపోయాడు. కాగా తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకోవడంతో పాటు డబ్బులు తీసుకుని మోసం చేసిన భరత్‌పై చర్యలు తీసుకోవాలని బాధిత యువతి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బీఎన్ఎస్ 69 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.