Hyderabad | కొండాపూర్, మే 16 : హైదరాబాద్‌లో నడుస్తున్న కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో కారు ముందు భాగం కాలిపోయింది. హైటెక్ సిటీ ఐటీ కారిడార్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. సైబర్ టవర్స్ నుంచి బయోడైవర్సిటీ, రాయదుర్గం మెట్రో స్టేషన్ వైపుగా వెళ్తున్న రెనాల్ట్ ట్రైబల్ కారు (TS09GP7765) మైండ్‌స్పేస్ ఎంట్రీ జంక్షన్ వద్దకు రాగానే ఇంజిన్‌లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు నడుపుతున్న వ్యక్తి వెంటనే పక్కకు ఆపి అందులోని బయటకు దిగాడు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న మాదాపూర్ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం సగం వరకు కాలిపోయింది. రోడ్డుపైనే ఈ ప్రమాదం జరగడంతో సైబర్ టవర్ నుంచి మైండ్ స్పేస్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే ట్రాఫిక్ పోలీసులు మంటల్లో కాలిపోయిన కారును పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.