Drugs | బంజారాహిల్స్, ఏప్రిల్ 3 : బిర్యానీ సెంటర్ వద్ద నిలబడి డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడిని అబ్కారీకి చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్‌రోడ్డు నెంబరు 11 తాడిపత్రి బిర్యానీ సెంటర్ వద్ద డ్రగ్స్ అమ్మకాలు సాగుతున్నట్టు అబ్కారీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో మఫ్టీలో నిఘా పెట్టగా ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా 7 గ్రాముల కోకైన్, 3.7 గ్రాముల ఎక్స్టసీ పిల్స్ లభించాయి. ప్రశ్నించగా ఓ పెడలర్ వద్ద నుంచి కొనుగోలు చేసి వాటిని ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు తేలింది. నిందితుడు వెస్ట్‌గోదావరి జిల్లా భీమవరానికి చెందిన కోపర్తి సాయిమణికంఠ అని తేలింది. పోలీసులు అతని వద్ద నుంచి మత్తు పదార్ధాలు, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ స్వాదీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.