Corona | సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): మళ్లీ కరోనా మహమ్మారి మరోసారి అలజడి సృష్టిస్తోంది. ఆసియా దేశాల్లో ఇప్పటికే కలకలం సృష్టిస్తున్న వైరస్ రెండు మూడు రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి తన ఉనికిని చాటుతోంది. తాజాగా నగరంలోనూ ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన ఏపీలోని విశాఖపట్నం, కడపలో నాలుగు కేసులు నమోద్వగా, ఢిల్లీలో ఒక్కరోజే 24 కేసులు, కేరళ 8 కేసులు నమోదైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రల్లో నమోదవుతున్న కరోనా కేసులతో అప్రమత్తమైన కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ అన్ని రాష్ర్టాలను అలర్ట్ చేసింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కరోనా కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వైద్యాధికారులు తెలిపారు. పొరుగు రాష్ర్టాల్లో నమోదవుతున్న కేసులతో పాటు నగరంలోనూ తొలి కేసు నమోదవడంతో వైద్య, ఆరోగ్యశాఖ నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోద్వడం, పొరుగు రాష్ర్టాల్లో కేసులు పెరుగుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు గాంధీ దవాఖానలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డా. రాజకుమారి వెల్లడించారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు గాను 50 ఆక్సిజన్ పడకలతో ప్రత్యేక ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశామన్నారు. క్లిష్టమైన కేసులకు చికిత్స అందించేందుకు ఈ వార్డులోని కొన్ని వెంటిలెటర్ పడకలు సైతం ఏర్పాటు చేశామని వెల్లడించారు.
దేశంలో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు వచ్చే వైరస్ పెద్ద ప్రమాదం ఏమీ కాదు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదు. కాని దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కరోనా లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రస్తుత వైరస్‌కు వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండవచ్చు, కానీ లక్షణాలు అతి స్వల్పంగా ఉంటాయి. దవాఖానలో అడ్మిట్ అయ్యే పరిస్థితులు పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాపిస్తున్న వైరస్లు ఒమిక్రాన్‌కు సంబంధించిన సబ్లీనియసెస్. ఇప్పుడు ఒమిక్రాన్ వైరస్ లేదు. కానీ దాని సబ్వేరియంట్లైన ఎంసీ 1.10.1, ఎల్బీ 1.3.1, ఎల్ఎఫ్7 అనే సబ్ వేరియంట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సబ్ వేరియంట్ల నుంచి వచ్చిన ఎల్పీ 8.1, ఎక్స్‌ఎఫ్‌పీ, ఎక్స్ఇసీ వేరియంట్లే ప్రస్తుతం వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా వేరియంట్లలో 70 శాతం ఎల్పీ 8.1 వేరియంటే కనిపిస్తుంది.
– డా.రాజారావు, ప్రిన్సిపాల్, ఉస్మానియా వైద్య కళాశాల
కరోనా వైరస్ అనేది డ్రాప్లెట్స్తోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఇది నోరు, కళ్లు, ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే నోరు, ముక్కు, కళ్లలో మ్యూకస్ మెంబరాన్స్ ఉంటాయి. ఈ మ్యూకస్ మెంబరాన్స్ ద్వారా ఏదైన బ్యాక్టీరియా గాని లేదా వైరస్ గాని సులభంగా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు చేతులతో ముఖాన్ని తాకకుండా జాగ్రత్తపడాలి. అయితే చాలా సార్లు మనకు తెలియకుండానే చేతులతో ముఖ భాగంలోని కన్ను, ముక్కు, నోరు తదితర భాగాలను తాకుతాం. ఇది సహజం కూడా. అందుకని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. శానిటైజ్ చేసుకోవాలి.
వ్యాధిగ్రస్తులున్న కుటుంబ సభ్యులు సైతం జాగ్రతలు పాటించాలి. ఎందుకంటే వారి వల్ల వీరికి వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. హాస్పిటల్స్‌కి వెళ్లినప్పుడు మాస్కు ధరించడం ఉత్తమం. మాస్కులు ధరించడం వల్ల కరోనానే కాకుండా ఇతర రెస్పిరేటరీ వైరస్ల నుంచి కూడా రక్షణ పొందవచ్చు. 60 ఏండ్ల పైబడిన పెద్దవారికి న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇప్పించడం మంచిది.
జనావాసాలకు, రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం మంచిది. కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లి, వైద్యులను సంప్రదించాలి. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగితే మందులు వాడుతూ కరోనా నియమాలతో ఐసోలేషన్‌లో ఉండాలి.లక్షణాలు ఉన్నవారు జనాల మధ్య తిరగకూడదు.
కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌కు చెందిన ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగినట్లు మేడ్చల్‌జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.ఉమాగౌరి వెల్లడించారు. ఐదురోజులుగా సదరు డాక్టర్ ఐసొలేషన్‌లో ఉన్నట్లు వివరించారు. అతడి కుటుంబ సభ్యులు, ఇతర కాంటాక్ట్స్‌కు ఎలాంటి లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం రోగి పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాడని, అతడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు వైద్యాధికారుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని బస్తీ దవాఖానలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు తదితర అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.