Hyderabad | మణికొండ ఫిబ్రవరి 9: నగర శివారు ప్రాంతంలోని జనవాడ మేకనుగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బ్రెయిన్ డెత్ అయిన భూమిక అవయవాలను తల్లిదండ్రులు ఆదివారం దానం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్వాడ మేకనుగడ్డ వద్ద పెళ్లికి వెళ్లొస్తుండగా ఇద్దరు హౌస్ సర్జన్లు ప్రమాదానికి గురయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో యశ్వంత్ అక్కడికక్కడే మృతిచెందాడు. భూమిక తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసిన వైద్యులు.. భూమిక బ్రెయిన్ డెడ్ అయ్యిందని తెలిపారు. దీంతో భూమిక కోరిక మేరకు ఆమె అవయవాలను తల్లిదండ్రులు దానం చేశారు. గుండె, లివర్, కళ్లు, కిడ్నీలను దానం చేశారు.
తమ కూతురు చనిపోతూ కూడా అవయవదానం చేయడం ద్వారా నలుగురి ప్రాణాలను కాపాడుతున్నదని భూమిక తల్లిదండ్రులు ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.