సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): విలాసాలకు అలవాటు పడిన ఓ ప్రేమ జంట ఈజీమనీ కోసం డ్రగ్స్ విక్రయాలు మొదలుపెట్టారు. చివరకు కటకటాల పాలయ్యారు. టాస్క్‌ఫోర్స్, హెచ్‌న్యూ విభాగం డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసే కాకినాడకు చెందిన ఉమ్మిడి ఇమ్మాన్యుయేల్‌కు డ్రగ్స్ తీసుకునే అలవాటు నుంచి డ్రగ్స్ అమ్మే పెడ్లర్‌గా మారాడు. ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న తన ప్రియురాలితో కలిసి కొండాపూర్‌లో నివాసముంటున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారు. ఇమ్మాన్యుయేల్ డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో ఉన్నాడు.
ప్రియురాలు ఇమ్మాన్యుయేల్ చేసే డ్రగ్స్ అమ్మకాల్లో కీలకపాత్ర పోషించేది. ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించిన మొత్తం వ్యవహారం ఆమెనే చేస్తుండేది. రాపిడో, స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న గొర్ల సాయికుమార్‌తో డ్రగ్స్ సరఫరా చేయించేది. హెచ్‌న్యూ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో చిక్కడపల్లిలో తనిఖీలు చేపట్టగా, ఇమ్మాన్యుయేల్, అతడి ప్రియురాలు, గొర్ల సాయికుమార్‌తో పాటు ఓ వినియోగదారుడిని పట్టుకున్నారు. వారి నుంచి వారి నుంచి 22 గ్రాముల హైడ్రోఫోనిక్ గంజాయి, 5 గ్రాముల ఎండీఎంఏ, 5.5 గ్రాముల ఎక్స్టసీ పిల్స్, 6 ఎల్ఎస్డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు.