హైదరాబాద్‌లోని నల్లకుంట ప్రాంతానికి చెందిన ఓ బిల్డర్స్ తాము నిర్మించిన టవర్స్‌కు సంబంధించిన విద్యుత్ కనెక్షన్ కోసం అధికారులు వేసిన ఎస్టిమేషన్ ప్రకారం జనవరిలో రూ.6.34లక్షలు టీజీఎస్పీడీసీఎల్కు కట్టారు. గత నెల ఈ కనెక్షన్‌కు సంబంధించి ఓసీ కావాలంటే అది కూడా అందజేశారు. అయినా ఇప్పటికీ డీటీఆర్ ఇవ్వకుండా సదరు కాంట్రాక్టర్‌ను డిస్కంచుట్టూ తిప్పుకుంటున్నారు. కారణమేంటంటే అంతకుముందు ఓసీ లేదని, ఇప్పుడేమో డీటీఆర్లు లేవని ఆ తర్వాత డీటీఆర్లు తీసుకున్నా కేబుల్ లేదంటూ సాకులు చెప్పడంతో ఆ టవర్స్‌లోని కొందరు ఫ్లాట్ల యజమానులు తాము గృహప్రవేశం చేయాలనుకున్నప్పటికీ కరెంట్ కనెక్షన్ లేక వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.
సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని ఎల్లారెడ్డిగూడలో నిర్మించిన ఓ టవర్స్‌కు సంబంధించి కనెక్షన్ కోసం డీటీఆర్‌లతో సహా రూ.5.72లక్షలు చెల్లించారు. అయితే ఇప్పటికీ ఆ అపార్ట్‌మెంట్‌కు కావలసిన డీటీఆర్లు అందుబాటులో లేకపోవడంతో కనెక్షన్ విషయంలో టీజీఎస్పీడీసీఎల్ సిబ్బంది జాప్యం చేస్తున్నారు. దీంతో అక్కడ ఫ్లాట్లు తీసుకున్న వినియోగదారులు ఈ నెల మొదటివారంలో గృహప్రవేశాలు చేసుకుందామనుకున్నప్పటికీ కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో ఆ కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.
గ్రేటర్లో టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న పది సర్కిళ్లలో ఇదే సమస్య కొనసాగుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలో మెటీరియల్ కొరత తీవ్రమైన కారణంగా చాలారకాల సామాగ్రి నెలల తరబడి లేక బిల్డర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టిమేషన్ ప్రకా రం లక్షల రూపాయలు డీడీలు కట్టి డీటీఆర్‌ల కూడా ఎదురుచూస్తుంటే డిస్కం నుంచి స్పందన లేకపోవడంతో పలుచోట్ల కొత్త కొత్త అపార్ట్మెంట్లు నిర్మాణం పూర్తయి విద్యుత్ కనెక్షన్ లేక వినియోగదారులు గృహప్రవేశాలను వాయిదా వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నిర్మాణ రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హైడ్రా కారణంగా రియల్ఎస్టేట్ పూర్తిగా పడిపోయిన ఈ తరుణంలో ఎంతో కష్టపడి ప్రాజెక్టు పనులు పూర్తి చేసినా బిల్డర్లు సకాలంలో కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.
ఇందుకు కేబుల్, ట్రాన్స్ఫార్మర్ల కొరతే ప్రధాన కారణంగా బిల్డర్లు చెబుతున్నారు. టీజీఎస్పీడీసీఎల్ నిబంధనల ప్రకారం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లభించిన ప్రాజెక్టులకు ట్రాన్స్ఫార్మర్ల , కేబుల్ కొరత కారణంగా కొనుగోలుదారులకు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం కుదరక సకాలంలో ఫ్లాట్లను అందించలేకపోతున్నారు. ఈ కారణంగా చాలామంది కొనుగోలుదారులు త మ గృహప్రవేశాలు వాయిదా వేసుకున్నట్లుగా సమాచారం.
మరోవైపు నిర్ణీతగడువులోగా ప్రాజెక్టును అందించకపోతే టీజీ రెరా జరిమానా వేయడానికి సిద్దంగా ఉంది నగరంలో ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడం మూలంగా అటు బిల్డర్లు, ఇటు కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటిజన్ చార్టర్ ప్రకారం టీజీఎస్పీడీసీఎల్లో కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకున్న రెండురోజుల్లో ఇవ్వాలి.. ఒకవేళ నెట్వర్క్ విస్తరించాల్సి వస్తే వారంరోజుల్లో ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ దక్షిణ డిస్కంలో నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆయా దరఖాస్తులు నిబంధనల ప్రకారం లేవని, ఓసీ తదితర పత్రాలు సమర్పించలేదనే కారణంతో కనెక్షన్లే ఇవ్వడం లేదని ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడంతో సమస్య మరింత జటిలమైంది.
వాయిదా పడ్డాయి..!
టీజీఎస్పీడీసీఎల్ అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం 20 కిలోవాట్ల కంటే ఎక్కువ విద్యుత్ లోడ్ ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలు ప్రభుత్వ పంపిణీ నెట్‌వర్క్‌పై ఆధారపడకుండా సొంతంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి తగ్గించి సొంతవాటిపై ఆధారపడడంతో పాటు మెరుగైన విద్యుత్ సరఫరాను అందించడమే లక్ష్యంగా విద్యుత్ అధికారులు చెప్పారు. అయితే దీని అమలుతీరులో మాత్రం డిస్కం నిబంధనలు కఠినతరంగా ఉండి ప్రాజెక్టుల పూర్తవడానికి తుదిదశలో ఆలస్యానికి కారణమవుతున్నది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి పదిమీటర్ల ఎత్తుదాటిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అవసరం కాగా గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఓసీ తప్పనిసరి చేయడంతో చాలా కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి తోడు ట్రాన్స్ఫార్మర్లు, కేబుళ్లు, ఇతర మౌలిక సదుపాయాలను కేవలం విద్యుత్ శాఖ లేదా వారు కేటాయించిన కాంట్రాక్టర్ల ద్వారానే సేకరించాలి. విద్యుత్ కాంట్రాక్టర్లు తాము కనెక్షన్ ఇస్తున్న భవనాలకు సంబంధించి కనెక్షన్లు ఇవ్వడానికి అవసరమైన సామాగ్రికోసం విద్యుత్‌శాఖకు డీడీలు కట్టి తమ సమయం వచ్చినప్పుడు ఆ మెటీరియల్ తీసుకోవాలి. స్టోర్స్‌లో సామాగ్రి కొరత కారణంగా తమకు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు తీసుకోవడం కాంట్రాక్టర్లకు చాలా సమస్యగా మారుతోంది.
దీంతో పాటు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్ ఇస్తామంటూ చెబుతుండడంతో మున్సిపల్‌శాఖ చుట్టూ తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే మున్సిపాలిటీ వారు ట్రాన్స్ఫార్మర్ పెడితేనే తాము ఓసీ ఇస్తామని చెప్పడంతో విద్యుత్ కాంట్రాక్టర్లు, వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాటు అన్నీ సిద్ధమై కరెంట్ లేక తాము చేయాలనుకున్న గృహ ప్రవేశాలు ఆలస్యమవుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. స్టోర్స్ లో కొరత కారణంగా ట్రాన్స్ఫార్మర్లు రావడానికి మూడు నుంచి తొమ్మిదినెలల సమయం పడుతున్నదని పలువురు బిల్డర్లు చెప్పారు.
గతంలో ఉన్న విధానమే బాగుండేదని, అనుమతి పొందిన తయారీదారుల నుంచి ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేసి ఓసీ రాకముందే వాటిని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉండేది. సర్టిఫికేట్ రాగానే విద్యుత్ సరఫరాను ప్రారంభించేవారు. దీంతో ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కానీ ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కేటగిరీ 8లో కనెక్షన్లు ఇచ్చి వినియోగదారులపై భారం మోపడమే కాకుండా నెలల తరబడి ప్రాజెక్టులు పూర్తికాకుండా అడ్డుపడేలా ఉన్న నిబంధనలను సవరించాలని అటు బిల్డర్లు, ఇటు విద్యుత్ కాంట్రాక్టర్లు, వినియోగదారులు టీజీఎస్పీడీసీఎల్ను కోరుతున్నారు.
ట్రాన్స్ఫార్మర్లు లేవు.. కేబుల్ దొరకదు..!
నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ఎల్టీఎంలకు వెంటనే కనెక్షన్లు ఇవ్వాల్సిన చోట అలాకాకుండా చాలా ఆలస్యం చేస్తున్నారంటూ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున డిస్కంకు ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారుల నుంచి డబ్బులు కట్టించుకుని నెలలు గడుస్తున్నా సామగ్రి ఇవ్వకపోవడంతో వారంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. గత ఆగస్టులో జారీ చేసిన వర్క్ ఆర్డర్లకు కూడా ఇప్పటికీ మెటీరియల్ ఇవ్వకపోవడంతో టర్న్‌కీ విధానంలో చేపట్టిన కాంట్రాక్టర్లు మింట్‌కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నారు. స్టోర్లలో 185 చదరపు మి.మీ.3కోర్ భూగర ్భకేబుల్ కొరత తీవ్రంగా ఉంది. 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 510 కావాలని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కనీసం 120 చ.మి.మీ. సింగిల్ కోర్ కేబుల్ కూడా లేదని వారు వాపోయారు.
ఇప్పటికే నగరంలో సుమారుగా 350 మంది ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉండగా వారికి కావలసిన సామాగ్రి సమయానికి అందకపోవడంతో తమ పనులను వాయిదా వేసుకుంటున్నామని చెప్పారు. నగరంలో నిర్మిస్తున్న భవనాలు దాదాపు నాలుగైదు అంతస్తులు ఉంటుండగా లోడ్‌ను బ్టటి కొందరు 25 కేవీఏ, ఎక్కువ శాతం 63 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటికి కావలసిన ఎస్టిమేషన్ అధికారుల ద్వారా వేయించి డబ్బులు కట్టినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. డిస్కం అడిగినంత డబ్బులు వినియోగదారుల ద్వారా కట్టించి విద్యుత్ పనులను చేసేందుకు తాము ఒప్పందం చేసుకున్నా.. స్టోర్లలో సామాగ్రి లేక పనులన్నీ నిలిచిపోయాయని విద్యుత్ కాంట్రాక్టర్లు అంటున్నారు.