మల్కాజిగిరి, అక్టోబర్ 25 : కార్పొరేటర్లు డబ్బులు తీసుకున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేస్తున్న ఆరోపణలను కార్పొరేటర్లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, సునీతారాము యాదవ్, మీనాఉపేందర్ రెడ్డి ఖండించారు. బుధవారం అల్వాల్ డివిజన్ కార్యాయంలో కార్పొరేటర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ టికెట్‌తోనే ప్రజలు తమను గెలిపించారని, పార్టీలోనే ఉంటామన్నారు. తమపై ఎమ్మెల్యే మైనంపల్లి డబ్బులు తీసుకున్నారంటూ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని.. దమ్ముంటే నిరూపించాలన్నారు.ప్రజా క్షేత్రంలో తేల్చుకుందామని, అల్వాల్ ముత్యాలమ్మ దేవాలయంలో తడిబట్టలతో ప్రమాణానికి మేం సిద్ధం.. మరి మీరు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
ప్రభుత్వ నిధులతో మల్కాజిగిరి నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి ఉండగానే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పుడున్న ఎమ్మెల్యే సొంత డబ్బులతో అభివృద్ధి చేయలేదన్నారు. మహిళా కార్పొరేటర్లు అని చూడకుండా తన ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పార్టీ టికెట్ కేటాయిస్తే…అయితే తన కుమారుడికి టికెట్ ఇవ్వలేదని పార్టీ అగ్రనేతలపై చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు. బెదిరింపులకు భయపడేది లేదన్నారు. విలేకరుల సమావేశంలో చింతల శ్రీనివాస్ రెడ్డి, అనిల్‌కిశోర్, రాము యాదవ్, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కరంచంద్, పరమేశ్, పుదారి రాజేశ్కన్న, చంద్రశేఖర్, ప్రేమ్, మల్లేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.