సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : ఓయూలో ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైర్డు అయిన 80 ఏండ్ల వృద్ధుడికి టెలిఫోన్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ కాల్ వచ్చింది.. ‘మీ పేరుతో రెండు మొబైల్ నంబర్లున్నాయి.. రెండో మొబైల్ నంబర్ అంధేరీలోని వెస్ట్ ముంబై అడ్రస్‌లో ఉందం’టూ మాట్లాడారు. తనకు ఒకటే ఫోన్ నంబర్ ఉన్నదని, రెండో నంబర్ ఎవరిదో తనకు తెలియదంటూ బాధితుడు ఎంత చెప్పినా.. ఫోన్లో మాట్లాడేవాళ్లు వినలేదు. ‘మీ పేరుపై మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఫలాన నంబర్లో మాట్లాడుకోండి..వాళ్లు అరెస్ట్‌కు సంబంధించిన వ్యవహారాన్ని చూసుకుంటారం’టూ ఆ నంబర్ చెప్పి ఫోన్ పెట్టాశారు. ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే.. ‘మేం సైబర్ క్రైమ్ డిపార్టుమెంట్ వాళ్లం. రాజ్ కుంద్ర మనీ లాండరింగ్ కేసులో మీకు కనెక్షన్లు ఉన్నట్లు అనుమానాలున్నాయి. ముంబైకి మీరు రావాల్సి వస్తుంది. ఈ కేసు సీబీఐ చూస్తుంద’ంటూ బెదిరింపులకు దిగారు. చివరికి బాధితుడి రెండు బ్యాంకు ఖాతాలోని రూ. 15.86 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేయించి.. ఆ డబ్బును తమ ఖాతాలో డిపాజిట్ చేయించారు. డబ్బు డిపాజిట్ చేసిన తరువాత వీడియో కాల్ కట్ చేసిన సైబర్‌నేరగాళ్లు.. మళ్లీ రేపు ఉదయం కాల్ చేస్తామం’టూ నమ్మించి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. బాధితుడు ఈ మోసాన్ని గుర్తించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.