Hyderabad | జవహర్‌నగర్, ఆగస్టు 2: ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్‌లో చోటు చేసుకుంది. కుషాయిగూడ ఏసీపీ మహేశ్, స్థానికుల కథనం ప్రకారం.. జవహర్‌నగర్ శ్రీరామ్‌నగర్‌కాలనీకి చెందిన బాలిక(16) హుస్నాబాద్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ.. 9వ తరగతి చదువుకుంటుంది. బోనాల పండుగకు ముందు తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.
వీరు నివాసముంటున్న ప్రాంతంలోనే ఉంటున్న బోడ శివ (20) కూల్ డ్రింక్స్ దుకాణంలో పనిచేస్తూ.. బాలికతో చనువుగా ఉంటున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి.. ప్రేమిస్తున్నానంటూ వెంటపడటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నెల 1న గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో తల్లి కూరగాయలు తీసుకురావడానికి బయటకు వెళ్లింది. ఈ సమయంలో బాలిక ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చిన తల్లి.. ఇంటి తలుపులు మూసి ఉండటంతో బాలికను తలుపులు తీయమంటూ ఫోన్ చేయగా స్పందించలేదు.
అనుమానంతో ఆమె చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఉరేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. శివ అనే యువకుడు ప్రేమ పేరుతో మానసికంగా వేధింపులకు గురిచేయడం వల్లే బాలిక మరణించిందంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తల్లి పేర్కొన్నది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు బోడ శివపై 305, 78, ఏఎన్ఎస్ సెక్షన్, పోక్సో 11, 12తో పాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు కుషాయిగూడ ఏసీపీ మహేశ్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సూసైడ్ నోట్ వంటివి ఏవీ లేవని, మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.