Shamshabad Airport | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 18 : ఓ కార్గో విమానంలో గేర్ సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేయడంతో పెద్దప్రమాదం తప్పింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరుగురు ప్రయాణికులతో కార్గో విమానం చెన్నై నుంచి బయల్దేరింది. అయితే ఆ విమానంలో గేర్ సమస్య తలెత్తడంతో అప్రమత్తమైన ఫైలెట్ అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులను అనుమతి కోరారు. ఎస్ఓఎస్ కాల్ అందుకున్న వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్‌లు, టేకాఫ్‌లను పూర్తిగా నిలిపివేసి కార్గో విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అటు ఫైలెట్‌తో పాటు ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు అధికారులు ఎలాంటి సమస్య తలెత్తకుండా సురక్షితంగా ల్యాండింగ్ చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.