Hyderabad | బంజారాహిల్స్, ఏప్రిల్ 8 : నగరం నడిబొడ్డున దర్జాగా సుమారు 300 గజాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన వ్యాపారితో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. షేక్‌పేట మండలం సర్వే నెంబర్ 403/పీలోకి వచ్చే బంజారాహిల్స్ రోడ్ నెం 2లో టీఎస్ నెంబర్ 1పి, బ్లాక్ హెచ్, వార్డు-9లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలానికి వెనకాల జూబ్లీహిల్స్ రోడ్ నెం 8లోని సత్వా ఎన్‌క్లేవ్‌లో జీహెచ్ఎంసీ ట్రీ పార్కును అనుకుని గుంటి శ్రీధర్‌రావు అనే వ్యాపారి ఇంటి నిర్మాణం చేపట్టారు. కాగా తన ప్లాటును ఆనుకుని ఉన్న ఖాళీ ప్రభుత్వ స్థలంపై కన్నేసిన శ్రీధర్‌రావు గత కొన్నిరోజులుగా బండరాళ్లను తొలగించి చదును చేశారు. భవన నిర్మాణ సామగ్రిని తెచ్చి అక్కడ వేయడంతో పాటు ఏకంగా భారీ షెడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ స్థలంలో ఆక్రమణలను తొలగించాలంటూ రెవెన్యూ సిబ్బంది హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో పాటు తనకు అనేకమంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని, నా జోలికి వస్తే మీరు ఇబ్బందులు పడతారంటూ దబాయిస్తున్నాడు.
ఈ క్రమంలో సోమవారం రాత్రి ప్రభుత్వ స్థలంలో హిటాచీ యంత్రంతో పనులు చేస్తుండడంతో సమాచారం అందుకున్న సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరామ్, షేక్‌పేట మండల తహసీల్దార్ అనితారెడ్డి అక్కడకు చేరుకున్నారు. స్థలంలో వెలిసిన ఆక్రమణలను తొలగించడంతో పాటు నిర్మాణసామగ్రిని సీజ్ చేశారు. ప్రభుత్వ స్థలంలో పనులు చేస్తున్న హిటాచీ యంత్రాన్ని సీజ్ చేశారు. ఆక్రమణకు గురయిన స్థలాన్ని సర్వే చేయగా 288 గజాలుగా తేలింది. ఈ స్థలం మార్కెట్ విలువ సుమారు రూ.12 కోట్లు ఉండవచ్చని అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ప్రభుత్వ స్థలం ఆక్రమణకు యత్నిస్తున్నట్లు గుర్తించి హెచ్చరించినా పట్టించుకోకపోవడంతో పాటు 288 గజాల స్థలాన్ని ఆక్రమించిన వ్యాపారి గుంటి శ్రీధర్‌రావుతో పాటు కాంట్రాక్టర్ నర్సింగరావు మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని తహసీల్దార్ అనితారెడ్డి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ 329(3), 324(3), రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం స్థలంలో ప్రభుత్వం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.