Hyderabad | హైదరాబాద్ : తన సోదరిని వేధిస్తున్నాడన్న కోపంతో బావపై కత్తితో దాడి చేశాడు ఓ బామ్మర్ది. ఈ ఘటన బోయిన్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని సంచారపురి కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. సోహైలో అనే యువకుడు తన సోదరిని సయ్యద్ జునైద్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే పెళ్లాయ్యక కొన్నాళ్లు భార్యాభర్తలు బాగానే ఉన్నారు. కానీ గత కొద్దికాలం నుంచి జునైద్ తన భార్యను వేధింపులకు గురి చేస్తూ మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. దీంతో బావపై బామ్మర్ది సోహైల్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి జునైద్ ఇంటికి సోహైల్ వెళ్లి.. అతనిపై పదునైన కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితుడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ దాడికి పాల్పడింది తామేనని సోహైల్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. మరోవైపు తనపై అక్రమంగా వరకట్నం వేధింపుల కేసు పెట్టి తనను, తన కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని జునైద్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.