Hyderabad | మెహిదీపట్నం, ఫిబ్రవరి 22 : లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాలుడు అర్ణవ్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
నాంపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం మధ్యాహ్నం మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లోని మఫర్ కంఫర్టెక్ అపార్టుమెంట్‌లోని లిఫ్ట్‌కు, గోడకు మధ్యలో అర్ణవ్ అనే బాలుడు ప్రమాదవశాత్తు ఇరుక్కున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని డిఆర్ఎఫ్ బృందాలతో కలిసి బాలుడిని బయటకు తీశారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆ బాలుడిని చికిత్స నిమిత్తం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.