నగర జనాభా కోటిన్నర దాటింది. ఇందుకు తగ్గట్టుగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మౌలిక వసతులకు పెద్దపీట వేసింది. పదేండ్లలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాలతో పోటీపడే స్థాయికి తెచ్చింది. ఒక్కో ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు పకడ్బందీ విధానాలను అమలు చేసింది. రోడ్లు.. లింకు రోడ్లు.. మెట్రో..ై ఫ్లెఓవర్లు. ఇలా అత్యంత కీలకమైన రవాణా వ్యవస్థను మెరుగుపరిచింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేసు గుర్రంలా పరుగులు పెట్టే మహానగరానికి కళ్లెం వేసింది. దిక్కూదివాణం లేని ప్రణాళికలతో.. అభివృద్ధి మాట అనేది కాగితాలకే పరిమితం చేసింది. ఏడాదిన్నరలో ఏ ఒక్క ప్రాజెక్టులోనూ తట్టెడు మట్టి తీసిందీ లేదు. ఏ ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. హడావుడే తప్ప.. ఆచరణలో రిక్త ‘హస్తమే’ చూపింది. అలైన్మెంట్ల మార్పు తో ప్ర‘గతి’ తప్పింది.
– సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ)
Hyderabad | కోటిన్నర దాటిన నగరానికి మెరుగైన రవాణా వ్యవస్థ అత్యంత కీలకం. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో రోడ్లు, మెట్రో, ఇతర ఆధునాతన రవాణా సౌకర్యాలను కల్పించాలనే లక్ష్యంతో పనిచేసింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ఎస్ఆర్డీపీ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చిన ఫ్లైఓవర్లు ఒకటైతే.. ట్రాఫిక్ రహిత కూడళ్ల కోసం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలతో నగరంలో వాహన వేగం పెరిగింది.
గడిచిన పదేండ్లలో ఏనాడూ ట్రాఫిక్ స్తంభించిన దాఖాల్లేకుండా రవాణా వ్యవస్థను మెరుగుపరిచింది. కోర్‌సిటీ నుంచి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఐటీ కారిడార్‌కు అనువుగా ఉండేలా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 36 కిలోమీటర్ల మేర పొడవైన మెట్రోకు ప్రతిపాదనలు చేసింది. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా శివారుల్లో ట్రక్కు పార్కులు, బస్ టెర్మినళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
కానీ కాంగ్రెస్ సర్కారు ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల నుంచి మొదలుకుంటే మెట్రో, హెచ్ఎండీఏ పరిధిలోని లింకు రోడ్ల వరకు తమకు అనుకూలంగా అలైన్మెంట్లు మార్పు చేసి.. అభివృద్ధిని నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది. అట్టహాసంగా ప్రకటించిన నార్త్ సిటీకి అనువైన ఎలివేటెడ్ కారిడార్, ఓల్డ్ సిటీకి మెట్రో, ఫ్యూచర్ సిటీకి గ్రీన్ ఫీల్డ్ హైవే, రెండో దశ మెట్రో విస్తరణ పేరిట రూపొందించిన ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఒక్కో ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలెక్కించేందుకు పకడ్బందీ విధానాలను అమలు చేస్తే.. కాంగ్రెస్ సర్కారు పేకమేడల్లా కుప్పకూల్చింది.
బీఆర్ఎస్ హయాంలో చేపట్టి, తుది దశలో ఉన్న ప్రాజెక్టులను మాత్రమే కాంగ్రెస్ సర్కారు పూర్తిచేసి ప్రారంభించింది. సొంతంగా కాంగ్రెస్ సర్కారు రూపొందించిన ప్రణాళికల లేకుండా పోయింది. హైదరాబాద్ నగరానికి తలమానికమైన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు సీఎం రేవంత్‌రెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేసి గాలికొదిలేశారు. 16 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు కోసం కనీసం భూసేకరణ కూడా చేయలేదు. హెచ్ఎండీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లో లింకు రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్నాయి. వీటి అలైన్మెంట్ మార్చివేసి, కొత్తగా చేపట్టాలని భావించినా.. అరకొర నిధులతో ఇప్పటికీ మొదలుకాలేదు.
హైదరాబాద్ చరిత్రలోనే సరికొత్త నగరాన్ని తీర్చిదిద్దుతామంటూ కాంగ్రెస్ తీసుకొచ్చిన 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఫ్యూచర్ సిటీ ప్రణాళికలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. కాగితాల్లో కనిపిస్తూ, జనసంచారమే లేని ఊహా నగరానికి మెట్రో పరుగులు పెట్టిస్తామని చెప్పి.. కోర్ సిటీలో మెట్రో ప్రతిపాదనలను అటకెక్కించింది. అలా నగరంలో రూ.24 వేల కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఫేస్-2 మెట్రో విస్తరణలో నార్త్‌సిటీకి చోటు కల్పించకుండానే ఫ్యూచర్ సిటీకి మెట్రో అంటూ హడావుడి చేసింది. రూ.24 వేల కోట్ల మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదనలకు ఏడాదిన్నర గడిచినా కేంద్ర నుంచి అనుమతులు తేలేకపోయింది.