హైదరాబాద్ : శనివారం అర్ధ రాత్రి గచ్చిబౌలి సమీపంలో కదులుతున్న మెర్సిడెస్-బెంజ్ కారుకు మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతంలోని వాహనదారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బంజారా హిల్స్ నుండి వసెల్లా మెడోస్ వైపు ప్రయాణిస్తున్న బెంజ్ కారు కొత్తగూడలోని ఎస్ఎల్ఎన్టీ సమీపంలోకి రాగానే కారులోంచి ఒక్కసారిగా పొగలు వెలువడి మంటలు అంటుకున్నాయి.
అప్రమత్తమైన డ్రైవర్ కారు నుంచి కిందకు దిగాడు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.