సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ ) : మరికొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. దాదాపు 21 రోజుల పాటు సుదీర్ఘ నిరీక్షణ వీడనుంది. రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉండగా..తొమ్మిది గంటల నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకల్లా పూర్తి ఫలితం వెల్లడి కానుంది. మొదట ఉదయం 5.30 గంటలకు ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో ఉద్యోగులకు విధుల కేటాయింపు ఉంటుంది. సుమారు ఆరువేల మంది ఉద్యోగులు ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. మొత్తం నాలుగు ఎంపీలు, కంటోన్మెంట్ అసెంబ్లీకి సంబంధించి 9,859 పోలింగ్ కేంద్రాల ఓట్లను 546 టేబుళ్లపై లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మూడు అసెంబ్లీ సెగ్మెంట్ల కేంద్రాల్లో సఫరేట్ హాలులో జరుగుతుందని ఎన్నికల అధికారి రొనాల్డ్‌రాస్ చెప్పారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని కమలానెహ్రూ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు కేంద్రంలో, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్ ప్రొ.రాంరెడ్డి ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి సీఎస్ఐఐటీ, వెస్లీ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో జరుగుతుందని వివరించారు.
మేడ్చల్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశారు. మల్కాజిగిరి లోక్ సభ ఓట్ల లెక్కింపును మేడ్చల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి మేడ్చల్ జిల్లా కీసర మండలం భోగారం హోళీమేరీ కళశాల, ఎల్బీనగర్ నియోజకవర్గానికి సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, కంటోన్మెంట్ నియోజవర్గానికి సికింద్రాబాద్‌లోని వెస్లీ కళాశాలలో మంగళవారం కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపునకు అధికారులు 178 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 575 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో విధులు నిర్వహించనున్నారు.
కంటోన్మెంట్, జూన్ 3: పోటాపోటీగా జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. కంటోన్మెంట్‌తో పాటు మల్కాజిగిరి పార్లమెంట్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు వెస్లీ కళాశాలలోని రెండు హాళ్లలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల లెక్కింపు చేపట్టనున్న నేపథ్యంలో అవసరమైన సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు కల్పించినట్లు రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ వెల్లడించారు. నియోజకవర్గం పరిధిలో మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉండగా 1,30,929 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 232 పోలింగ్ కేంద్రాలతో పాటు మూడు అదనపు పోలింగ్ స్టేషన్లతో కలిపి మొత్తం 235 ఈవీఎంలలో ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఈ మేరకు 17 రౌండ్లకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లను సోమవారం నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
