సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖాన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డా.రాకేశ్ సాహె, మానసిక రోగుల దవాఖాన సూపరింటెండెంట్ డా. అనిత వెల్లడించారు. ఈనెల 2న ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖానలో రోగులకు అందించిన రాత్రి భోజనం వికటించడంతో 90 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కరణ్(30) అనే రోగి మృతిచెందగా, మిగిలిన రోగులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో 18 మంది పరిస్థితి కొంత ఆందోళన కరంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా దవాఖానకు తరలించగా మిగిలిన రోగులకు ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖానలోనే వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని, వారి కోసం ప్రత్యేక వైద్యబృందాన్ని ఏర్పాటు చేసినట్లు దవాఖాన సూపరింటెండెంట్ డా. రాకేశ్ సాహె వివరించారు.
ఫుడ్ పాయిజన్‌కు గురైన రోగుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ హాస్పిటల్లో పరిస్థితులు మెరుగుపడే వరకు సదరు రోగులకు ఉస్మానియాలోనే చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. కాగా ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఫుడ్ పాయిజన్ ఘటనపై డీఎంఈ దర్యాప్తు నివేదిక ఆధారంగా దవాఖాన ఇన్చార్జ్ సీఎస్-ఆర్ఎంవో డా. పద్మజను విధుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఆమె స్థానంలో ఉస్మానియా డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్ఎంవో డా.శంకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎర్రగడ్డ మెంటల్ హెల్త్ ఆర్ఎంవో డా. పద్మజను డీహెచ్‌కు రిపోర్ట్ చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
రోగులకు అందించే ఆహార తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, కలుషిత ఆహారంతో 92 మంది రోగుల ఫుడ్‌పాయిజన్‌కు కారణమైన డైట్ కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే రోగులు ఫుడ్‌పాయిజన్‌కు గురైనట్లు గుర్తించిన ప్రభుత్వం..కాంట్రాక్టర్ అందిస్తున్న డైట్‌పై సరైన పర్యవేక్షణ చేయనందుకు దవాఖాన సిబ్బందిపై కూడా చర్యలకు ఆదేశించింది.
ఎర్రగడ్డ మానసిక రోగుల దవాఖానలో జరిగిన ఫుడ్‌పాయిజన్ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో దవాఖానలో రోగులకు అందిస్తున్న ఆహార పదార్థాలు, మంచినీరు తదితర అంశాలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. దవాఖానలోని తాగునీటి నాణ్యతపై పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో ఎలాంటి సమస్య లేదని అధికారులు తెలిపారు. కాని రోగులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని, సరైన పౌష్టికాహారం కూడా అందించడంలో డైట్ కాంట్రాక్టర్ పూర్తిగా విఫలమైనట్లు అధికారుల బృందం గుర్తించినట్లు సమాచారం.
ఈ నివేదిక మేరకే సంబంధిత డైట్ కాంట్రాక్ట్‌ను వెంటనే రద్దు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫుడ్‌పాయిజన్‌కు గురైన రోగుల నమూనాలను ఉస్మానియా, నిమ్స్ దవాఖానలోని మైక్రోబయాలజి విభాగానికి పంపినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఫుడ్‌పాయిజన్ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన కరణ్ మృతదేహానికి ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం జరిపారు. కాగా పోస్టుమార్టం నివేదికలో ఫుడ్‌పాయిజన్‌కు సంబంధించిన ఆనవాలు లేవనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సంబంధిత పోస్టుమార్టం నివేదికను వైద్యులు అధికారికంగా ప్రకటించలేదు.
ఫుడ్‌పాయిజన్ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని, అంతేకాకుండా రోగుల నమూనాలను పరీక్షల కోసం మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపినట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బాధ్యులైన వారిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, నివేదికలు వచ్చిన తరువాత, వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.