Eye Problems | సిటీబ్యూరో: చిన్నారుల కండ్లు ప్రమాదపు వలయంలో చిక్కుకుపోతున్నాయి. జిల్లాలో వైద్యాధికారులు చేస్తున్న కంటి పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 96.9 శాతం పరీక్షలు జరపగా, ఏకంగా 87.1శాతం మంది విద్యార్థుల కండ్లు దృష్టి సమస్యలతో సతమతమవుతున్నాయని వెల్లడైంది. వీళ్లందరికీ కళ్లజోడు పెడితే కానీ చదువు ముందుకు సాగదన్న విషయం తేటతెల్లమైంది. తరగతి గదిలో బోర్డుపై అక్షరాలను గుర్తించలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే చిన్నారులందరికీ వైద్యాధికారులు గత నెల 17 నుంచి ఈ నెల 6 వరకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.
హైదరాబాద్ జిల్లాలో 8578 మందికి టెస్టులు చేశారు. వారిలో 7471 మంది విద్యార్థులు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. 87.1శాతం మందికి కంటి అద్దాలు కావాల్సి ఉంది. ఇప్పటివరకు 1018 మంది విద్యార్థుల వరకే రాష్ట్ర ఆరోగ్యశాఖ కంటి అద్దాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మిగతావారికి కూడా అతి త్వరలోనే వస్తాయని వైద్యాధికారులు తెలపడం గమనార్హం.