సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): క్రిప్టో కరెన్సీలో భారీ లాభాలొస్తాయని నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ.86 లక్షలు బురిడీ కొట్టించారు. ఈసీఐఎల్ ప్రాంతంలో నివాసముండే బాధితుడికి గత ఏడాది జనవరి నెలలో టెలిగ్రామ్‌లో అంథోని పేరుతో మెసేజ్ వచ్చింది.
తాను క్రిపో కరెన్సీ ట్రేడింగ్‌లో నిష్ణాతుడినని, తాము రోజూ ఈ ట్రేడింగ్‌తో మంచి లాభాలు ఆర్జిస్తున్నామని నమ్మించాడు. ట్రేడింగ్ యాప్ లింక్‌ను బాధితుడికి పంపించారు. బాధితుడు లింక్‌ను క్లిక్ చేసి ఖాతాను ప్రారంభించాడు. మొదట సుమారు రూ.11 వేలు పెట్టుబడి పెట్టడంతో, కొంత లాభం వచ్చిందని, వాటిని విత్ డ్రా చేసుకోవాలని సూచనలు చేశాడు.
ఇలా కొన్ని రోజులపాటు తక్కువ మొత్తంలో బాధితుడు డబ్బులు పెట్టి లాభాలు విత్ డ్రా చేసుకున్నాడు. నమ్మకం కుదిరిన తరువాత నెమ్మదిగా పెట్టుబడిని పెంచడం ప్రారంభించాడు. ఇలా 316 సార్లు సైబర్‌నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాల్లోకి రూ. 87.50 లక్షలు పంపించాడు. డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నించడంతో, 20 శాతం కమిషన్ చెల్లించాలని చెప్పారు. దీంతోమోసం నుంచి తేరుకొని ఇటీవల మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.