అబిడ్స్, జూన్ 18: కల్తీ పన్నీర్ తయారీ, విక్రయ కేంద్రాలపై హెచ్ ఫాస్ట్ అధికారులు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో కల్తీ పన్నీర్, చీజ్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉస్మాన్గంజ్లోని హెచ్ ఫాస్ట్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. కొందరు ఫుడ్ బిజినెస్ వ్యాపారులు కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి చీజ్ అనలాగ్ను తీసుకువచ్చి దానిని స్వచ్ఛమైన పన్నీర్గా తయారు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయాలు చేస్తున్నట్లు తెలిపారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని 45 పన్నీర్ తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించగా పన్నీర్ ప్యాకెట్లపై బ్యాచ్ నంబర్, గడువు తేదీ లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. అపరిశుభ్రమైన నిల్వ విధానాలను కూడా గుర్తించామని, 825 కిలోల నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రజలు పన్నీర్ కొనుగోలు చేసే సమయంలో వివరాలు చెక్ చేసుకోవాలని డీసీపీ సూచించారు.