సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ పరిధిలో వివాదాస్పద భూములపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ మేరకు హెచ్ఎండీఏ వద్ద ఉన్న భూముల్లో కోర్టు వివాదాలు, ఆక్రమణల జాబితాను సిద్ధం చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా వివాదరహిత ల్యాండ్ బ్యాంక్‌ను గుర్తించి నివేదిక రూపొందించనున్నారు. హెచ్ఎండీఏ వద్దే విలువైన భూములు ఉండగా… తాజా చర్యలు దేనికి అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. భూముల స్థితిగతులను అంచనా వేసే క్రమంలో తాజా నివేదికను రూపొందిస్తున్నట్లు తెలిసింది.
ఏడు జిల్లాల పరిధిలో విస్తరించిన హెచ్ఎండీఏ పుష్కలమైన ల్యాండ్ బ్యాంక్‌ను కల్గి ఉంది.హుడా నుంచి హెచ్ఎండీఏగా రూపాంతరం చెందిన తర్వాత ప్రభుత్వం భారీ మొత్తంలో భూములను కేటాయించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మహానగరంలో మౌలిక వసతుల కల్పనకు అనుగుణంగా వినియోగించుకునేలా హెచ్ఎండీఏ ఆధీనంలో దాదాపు 8వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉండగా… ఇందులో ఇప్పటికే పలు ప్రాజెక్టుల కోసం భారీ స్థాయిలో భూములను కేటాయించారు. టైటిల్, పొసెషన్ క్లియరెన్స్ ఉన్న ఆయా సర్వే నంబర్లలో ఉన్న భూముల వివరాలను సేకరిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో బుద్వేల్ ఐటీ పార్క్, ట్రక్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టుల కోసం కేటాయించడంతోపాటు, ట్రక్ పార్క్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
కోర్టు వివాదాలే ఎక్కువ…
ఓఆర్ఆర్కు సమీపంలో హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న భూముల్లో ఎక్కువ కోర్టు వివాదాల్లోనే ఉన్నాయి. ఈక్రమంలో వాటిని ఆయా కోర్టు కేసులు, ప్రస్తుత పరిస్థితి, స్వాధీనంలో ఉన్న భూముల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 7,452 ఎకరాలను హెచ్ఎండీఏకు కేటాయించారు. ఇప్పటికే 3500 ఎకరాలకు పైగా వినియోగంలోకి వచ్చింది. అలాగే హైదరాబాద్ జిల్లా పరిధిలో 249 ఎకరాలు, మెదక్ జిల్లా పరిధిలో 558 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉండగా… ఈ రెండు జిల్లాల్లో 50 శాతానికి పైగా వివిధ ప్రాజెక్టుల పేరిట హెచ్ఎండీఏ ఇప్పటికే వినియోగంలోకి తీసుకువచ్చింది. మిగిలిన 4300 ఎకరాల భూముల్లో ఎంత వరకు క్లియర్ టైటిల్, పొసెషన్, కోర్టు చిక్కులు లేకుండా ఉందనే విషయాన్ని తెలుసుకోనున్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియాపూర్‌లో సర్వే నం.20,28లో మొత్తం 105 ఎకరాలు ఉండగా. దీనిని ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ ప్రాజెక్టును చేపట్టేందుకు కేటాయించారు.
అలాగే రాజేంద్రనగర్ పరిధిలో 6 ఎకరాల్లో పరాధీనంలో ఉండగా, మియాపూర్ పరిధిలోనూ మరో 46 ఎకరాలు కోర్టు వివాదంలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆక్రమణలతో వివాదాస్పదమైన మియాపూర్‌లోని సర్వే నం.100, 101లో ఉన్న 450 ఎకరాల భూమి మొత్తం కోర్టు వివాదంలోనే ఉంది. 2003లోనే ఈ భూములన్నీ హెచ్ఎండీఏకు చెందినవని హైకోర్టు ఆదేశించినా… అప్పటికే వందల ఎకరాల్లో నిర్మాణాలను గుర్తించారు. నానక్‌రాంగూడ పరిధిలోని విలువైన భూమి కూడా వివాదంలో ఉంది. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్‌లో 282 నుంచి 290 వరకు సర్వే నంబర్లలో ఉన్న 85 ఎకరాల విస్తీర్ణంలో 72 ఎకరాలను సైన్స్ సిటీ నిర్మాణానికి కేటాయించగా, మరో 13 ఎకరాల వెకేట్ ల్యాండ్ ఉన్నట్లు తెలిసింది. ఇలా మొత్తంగా 1200 ఎకరాలు కోర్టు వివాదాల్లో ఉందనీ, ఎలాంటి కోర్టు వివాదాలు, ఆక్రమణలు లేకుండా ఉన్న భూమి కేవలం 2500 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. అయితే సమగ్రమైన వివరాలతో నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి హెచ్ఎండీఏ అందజేయనుంది.