బాలాపూర్’లో ఎనిమిది బస్తీ దవాఖానలు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
బడంగ్‌పేట, మార్చి 27: బాలాపూర్ మండలానికి ప్రభుత్వం ఎనిమిది బస్తీ దవాఖానలు మంజూరు చేసింది. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మూడు బస్తీ దవాఖానలు, జల్పల్లి మున్సిపాలిటీలో నాలుగు బస్తీ దవాఖానలు, మీర్‌పేటలో ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలన్న సంకల్పంతో మూడు బస్తీ దవాఖానలను మంజూరు చేసింది. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అల్మాస్గూడ, నాదర్గుల్, మామిడిపల్లి, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బస్తీ దవాఖాన, జల్పల్లి మున్సిపాలిటలో కొత్తపేట, పహాడీషరీఫ్, షాహిన్ నగర్, శ్రీరాం కాలనీలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడానికి భవనాలను పరిశీలించారు. సరూర్‌నగర్ డివిజన్లోని అంబేద్కర్ నగర్లో, భగత్ సింగ్ నగర్లో, ఆర్కేపురం డివిజన్లో ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఇటీవలే బడంగ్‌పేటలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషితో బడంగ్పేటలోనే మరో వంద పడకల దవాఖాన ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్మాస్గూడ వార్డు ఆఫీసులో బస్తీ దవాఖాన, నాదర్గుల్లో హోమియోపతి దవాఖాన ఉన్న చోట బస్తీ దవాఖాన, మామిడిపల్లి రంగనాయకుల కాలనీలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
భవనాలు పరిశీలించాం
బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడానికి భవనాలను పరిశీలించాం. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయబోతున్నాము. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు నివేదిక అందజేశాం. వైద్య సిబ్బంది ఎంపిక కూడా అయిపోయింది. మంత్రి సమయం తీసుకున్న తర్వాత బస్తీ దవాఖాన ప్రారంభోత్సవాన్ని ఖరారు చేస్తాం.
– కృష్ణమోహన్‌రెడ్డి, కమిషనర్
నీటి వృథాను అరికట్టాలి
ఆర్కేపురం, మార్చి 27: జల దినోత్సవంలో భాగంగా మార్చి 22 నుంచి 31వ తేదీ వరకు జలమండలి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాయిబాబా కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జలమండలి అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి జాల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షం నీటిని ఒడిసి పట్టేందుకు కాలనీ వాసులు ఇంకుడు గుంతలను నిర్మించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ఫౌండర్ టి.సురేందర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.