Srinivasa Mangapuram | ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో సినీ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా రూపొందుతున్న శ్రీనివాస మంగాపురంపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు ఘట్టమనేని రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ హీరోగా నటిస్తున్నఈ చిత్రాన్ని విభిన్న కథలను ఎంచుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా వినిపిస్తున్న ఓ వార్త మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. జూలై 30, 2026న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
రిలీజ్‌కు ఇంకా కొన్ని వారాలు ఉండగానే సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయని, చిత్రబృందం విడుదలకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం, వచ్చే వారంలో ఘట్టమనేని కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయనున్నారట. ఈ స్పెషల్ షోలో కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా చిత్ర యూనిట్‌కు అత్యంత సన్నిహితులు కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రదర్శనకు సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
అయితే ప్రస్తుతం మహేష్ బాబు తన పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉండటంతో, ఆ రోజున ఆయన ఈ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యే అవకాశం తక్కువగా ఉందని సమాచారం. అందుకే మహేష్ బాబు కోసం మరో ప్రత్యేక షోను వేరుగా ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ ప్రత్యేక ప్రదర్శనకు హీరో జయకృష్ణతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం, దర్శకుడు అజయ్ భూపతి కూడా హాజరుకానున్నారని సమాచారం. ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా సాధారణ కమర్షియల్ కథ కాదు. తిరుపతి ప్రాంతం, ముఖ్యంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ సాగే కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్లు తెలుస్తోంది. విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరించిన పవిత్ర క్షేత్రంలో జరిగిన ఒక విశేష సంఘటన ఆధారంగా ఈ కథ సాగుతుందని, భక్తి, మిస్టరీ, భావోద్వేగాలు, థ్రిల్లింగ్ అంశాల సమ్మేళనంగా దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం.