హైదరాబాద్: ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్‌సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా, 2.64 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రస్తుతం జలాశయంలోకి 17 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 7,926 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరికాసేపట్లో మరో రెండు గేట్లను ఎత్తనున్నట్లు తెలుస్తున్నది.
ఇక ఉస్మాన్‌సాగర్ జలాశయానికి 4 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 3.90 టీఎంసీలు కాగా, ఇప్పుడు 2.87 టీఎంసీల నీరు ఉన్నది. కాగా, హిమాయత్‌సాగర్ నుంచి నీటిని విడుదల చేయడంతో రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు రహదారిని మూసివేశారు. రెండు వైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాలను దారిమళ్లిస్తున్నారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.