సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం కనుల పండువగా సాగాయి. ఈ వేడుకలకు హాజరైన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్.వి.కర్ణన్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మేయర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలు, జీహెచ్ఎంసీ అమలు చేస్తున్న పథకాలు, భవిష్యత్ ప్రణాళికలను మేయర్ వివరించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు, ట్రాన్స్జెండర్లకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రూ.290 కోట్ల రుణాలను పంపిణీ చేశారు.
వీటిలో స్వయం సహాయక సంఘాలకు రూ.288.85కోట్లు, స్వయం ఉపాధి కింద 155 మంది ట్రాన్స్జెండర్లకు రూ.55 లక్షలను పంపిణీ చేశారు. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ నియమాక పత్రాలను అందజేశారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రాఫిక్ డిజైన్ కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు ట్రాన్స్జెండర్లు మధురాజ్, ఇమ్రాన్‌ఖాన్, నవీన, వరుణ్ తేజ్‌లకు రెడ్ టీవీ జాబ్ఆఫర్ పత్రాలను మేయర్ అందించి అభినందించారు. అంతేకాకుండా డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 5 మంది మహిళలకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్, వేణుగోపాల్, సుభద్రాదేవి, పంకజ, సీసీపీ శ్రీనివాస్, ఏఎస్పీ విజిలెన్స్ సుదర్శన్, ఏఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ, అడిషనల్ సీసీపీ వెంకన్న ప్రదీప్, సీఈ రత్నాకర్ సహదేవ్ పాల్గొన్నారు.
హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ హరిచందన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. కులాంతర వివాహం చేసుకున్న 15 జంటలకు రూ.2.5 లక్షల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ముకుందరెడ్డి, కదివరన్ పలని, డీఆర్వోలు వెంకటాచారి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం, సంక్షేమాధికారులు ఆశన్న, ప్రవీణ్, కోటాజీ, ఇలియాస్ అహ్మద్ పాల్గొన్నారు.
తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడులకలను ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో విద్యుత్ శాఖ కీలక భూమిక పోషిస్తుందన్నారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల సెక్షన్ లైన్మెన్ మధుసూదన్ విధి నిర్వహణలో చూపిన శ్రద్ధ, నిబద్ధతతను ప్రశంసిస్తూ సీఎండీ ఆయనను సత్కరించారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నారాయణకు మహోన్నత పతకం, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు సేవా పతకం అందించారు. డైరెక్టర్లు నర్సింహులు,చక్రపాణి, కృష్ణారెడ్డి, సీవీవోనారాయణ పాల్గొన్నారు.
సిటీబ్యూరో, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : పంద్రాగస్టు వేడుకలను మెట్రో, హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయాల్లో వేడుకగా నిర్వహించారు. అమీర్‌పేట్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, బేగంపేట్‌లోని మెట్రో భవన్లో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరించారు. స్వతంత్ర భారతానికి ఎంతో మంది ప్రాణత్యాగం చేశారనీ, అమరులైన సమరయోధుల త్యాగఫలమే నేటి భారతమని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో హెచ్ఎండీఏ కీలకపాత్ర పోషిస్తుందని.. ఎలివేటెడ్ కారిడార్, మాస్టర్ ప్లాన్-2050, పబ్లిక్ ఏరియాలను డెవలప్ చేస్తున్నట్లుగా కమిషనర్ సర్ఫరాజ్ తెలిపారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయడంలోనే భాగమే మెట్రో ఫేజ్-2 విస్తరణ అన్నారు. నగరాభివృద్ధిలో మెట్రో విస్తరణ కీలకమని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.